చివరి నిమిషంలో పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) నుంచి తప్పుకునే విదేశీ ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్ మోహ్‌సిన్ నఖ్వీ హెచ్చరించాడు. ఐపీఎల్ 2026 సీజన్ కోసం పీఎస్‌ఎల్ నుంచి తప్పుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు. వరుసగా రెండో ఏడాది కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్), ఐపీఎల్‌లు ఒకే సమయంలో జరగనున్నాయి. దాంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌ను వదిలేసి ఐపీఎల్ ఆడేందుకు మొగ్గు చూపుతున్నారు.
జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజరాబాని, శ్రీలంక స్టార్ ఆల్‌రౌండర్ డసన్ షనక, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్ పీఎస్‌ఎల్‌ను వీడి ఐపీఎల్ ఆడేందుకు సిద్దమయ్యారు. చివరి నిమిషంలో ఈ ఆటగాళ్లు పాకిస్థాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీలతో తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుతో బ్లెస్సింగ్ ముజారాబానీ, లాహోర్ ఖలందర్స్ జట్టుతో డసన్ షనక తమ కాంట్రాక్టులను వదులుకున్నారు.

ఈ వ్యవహారంపై స్పందించిన మోహ్‌సిన్ నఖ్వీ విదేశీ ఆటగాళ్లపై విమర్శలు గుప్పించాడు. 'మేం రూల్స్ ప్రకారం ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటాం. గతేడాది పెషావర్ జల్మీకి ఆడిన కార్బిన్ బోష్.. ఆఖరి నిమిషంలో జట్టును వీడి ముంబై ఇండియన్స్‌లో చేరాడు. దాంతో పీఎస్‌ఎల్ ఆడకుండా అతనిపై ఏడాది పాటు నిషేధం విధించారు. ఈ సారి కూడా అదే విధమైన కఠిన చర్యలు తీసుకుంటాం.
ఐపీఎల్‌తో షెడ్యూల్ క్లాష్ అవ్వడం వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కొంతమంది ఆటగాళ్లు అక్కడికి వెళ్లినప్పటికీ, చాలా మంది అగ్రశ్రేణి ఆటగాళ్లు మా కోసం ఆడటానికి ఇక్కడికి వస్తారు. మరే విండో ఖాళీ లేనందున ఈ సమయంలోనే పీఎస్‌ఎల్‌ను నిర్వహించాలని మేం నిర్ణయించుకున్నాం.'అని మోహ్‌సిన్ నఖ్వీ చెప్పుకొచ్చాడు.
గుడకేష్ మోతీ, జేక్ ఫ్రెజర్ మెక్‌గర్క్, ఓట్నియల్ బార్ట్‌మన్, స్పెన్సర్ జాన్సన్ వంటి ఆటగాళ్లు కూడా వ్యక్తిగత కారణాలతో పీఎస్‌ఎల్‌కు దూరమయ్యారు. పీఎస్‌ఎల్ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుండగా.. ఐపీఎల్ 2026 సీజన్‌కు మార్చి 28న తెరలేవనుంది.