బ్యాటింగ్‌లో శుభారంభం అందుకోకపోవడంతో పాటు బౌలింగ్‌లో సరైన ముగింపు ఇవ్వకపోవడంతో మరోసారి గెలిచే మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నామని పంజాబ్ కింగ్స్ తాత్కలిక కెప్టెన్ సామ్ కరణ్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సామ్ కరణ్.. దురదృష్టవశాత్తు గత మ్యాచ్‌లానే తృటిలో విజయాన్ని చేజార్చుకున్నామని తెలిపాడు. 'ఈ పిచ్ చాలా నెమ్మదిగా ఉంది. అయితే మేం బ్యాటింగ్‌లో శుభారంభం అందుకోలేకపోయాం. బౌలింగ్‌లో సరైన ముగింపు ఇవ్వలేకపోయాం. లోయరార్డర్ సూపర్ బ్యాటింగ్‌తో మాకు పోరాడే లక్ష్యం దక్కింది.

మా బౌలింగ్ కూడా అద్భుతంగా ఉంది. అసాధారణ ప్రదర్శన రాజస్థాన్ రాయల్స్‌ను ఓటమి ముంగిట నిలబెట్టాం. కానీ దురదృష్టవశాత్తు విజయాన్ని అందుకోలేకపోయాం. మా ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్, బౌలింగ్ చేశాం. తదుపరి మ్యాచ్‌లో పుంజుకుంటాం. తమ సొంతమైదానంలో వరుసగా మూడు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి.
ఇక్కడి కండిషన్స్‌ను మేం అందిపుచ్చుకున్నాం. మొదటి మ్యాచ్ గెలవడంతో పాటు తర్వాతి రెండు మ్యాచ్‌లను తృటిలో చేజార్చుకున్నాం. ఈ ఓటమిని జీర్ణించుకోవడం కాస్త కష్టంగానే ఉంది. కానీ మా కుర్రాళ్లు ఆడిన తీరు అద్భుతంగా ఉంది.'అని సామ్ కరణ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేసింది. జితేశ్ శర్మ(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29), అషుతోష్ శర్మ(16 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 31) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్, కేశవ్ మహరాజ్ రెండేసి వికెట్లు తీయగా.. కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్(28 బంతుల్లో 4 ఫోర్లతో 39), షిమ్రాన్ హెట్‌మైర్(10 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27 నాటౌట్) రాణించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా(2/18), సామ్ కరణ్ రెండేసి వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు