మొహాలీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫీల్డర్లు మహమ్మద్ సిరాజ్, వానిందు హసరంగా కళ్లు చెదిరే రనౌట్లతో ఔరా అనిపించారు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సిరాజ్, హసరంగా స్టన్నింగ్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరి సూపర్ ఫీల్డింగ్‌కు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్(13), హర్‌ప్రీత్ సింగ్(13) నిరాశగా పెవిలియన్ చేరారు.
ఈ రెండు రనౌట్లు కూడా విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్‌లోనే కావడం మరో విశేషం. ప్రస్తుతం ఈ రనౌట్లకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. ఇన్నింగ్స్ 6వ ఓవర్‌లో సిరాజ్ సూపర్ త్రోకు హర్‌ప్రీత్ సింగ్ రనౌటవ్వగా.. 10వ ఓవర్‌లో హసరంగా డైరెక్ట్ హిట్‌కు సామ్ కరణ్ బలయ్యాడు.
విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 6వ ఓవర్ మూడో బంతిని ప్రభ్‌సిమ్రాన్ సింగ్ మిడాఫ్ దిశగా ఆడగా.. నాన్ స్ట్రైకర్ హర్‌ప్రీత్ సింగ్ సింగిల్ కోసం క్రీజు ధాటాడు. బంతిని సిరాజ్ అందుకోవడం గమనించిన ప్రభ్‌సిమ్రాన్ సింగిల్ వద్దని చెప్పగా.. హర్‌ప్రీత్ యూటర్న్ తీసుకొని వెనక్కివెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అందుకున్న సిరాజ్ డైరెక్ట్‌గా వికెట్లను కొట్టేయడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు.

మళ్లీ విజయ్ కుమార్ వైశాఖ్ వేసిన 10వ ఓవర్‌లోనే సామ్ కరణ్ రనౌటయ్యాడు. ఈ ఓవర్ ఐదో బంతిని సామ్ కరణ్ బ్యాక్ వర్డ్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేయగా.. బంతిని అందుకున్న హసరంగా నేరుగా నాన్ స్ట్రైకర్ వైపు వికెట్లను కొట్టేసాడు. కాస్త లేజీగా పరుగెత్తడంతో సామ్ కరణ్ మూల్యం చెల్లించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్(56 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 84), విరాట్ కోహ్లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 59) హాఫ్ సెంచరీలతో రాణించారు. పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ రెండు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 106 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ సూపర్ బ్యాటింగ్‌తో పోరాడుతున్నాడు. పంజాబ్ విజయానికి 23 బంతుల్లో 35 పరుగులు అవసరం.