
చెన్నై: మహ్మద్ షమీ(2/21), రవి బిష్ణోయ్(2/21) కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మ(52 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 63), సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 33) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ మెరుపులు మెరిపించకపోవడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 131 రన్స్ మాత్రమే చేసింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని అందిపుచ్చుకున్న పంజాబ్ బౌలర్లకు మెరుపు ఫీల్డింగ్ తోడవడంతో ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో షమీ, రవికి తోడుగా.. దీపక్ హుడా, అర్షదీప్ సింగ్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పార్ట్‌టైమ్ బౌలర్ దీపక్ హుడా బౌలింగ్‌లో ఓపెనర్ క్వింటన్ డికాక్(3) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్(6)తో కెప్టెన్ రోహిత్ నిదానంగా ఆడాడు. దాంతో ముంబై పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 21 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైకి ఇది రెండో అత్యల్ప పవర్ ప్లే స్కోర్ కావడం గమనార్హం.
ఇక రవి బిష్ణోయ్ మరుసటి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. అయితే ఫాబియన్ అలెన్ వేసిన మరుసటి ఓవర్‌లో రోహిత్ రెండు వరుస బౌండరీలు బాదాడు. అతనికి తోడుగా సూర్య కూడా సూపర్ షాట్స్ ఆడాడు. ఈ స్లో వికెట్‌పై అడపా దడపా బౌండరీలు బాదిన ఈ జోడీ రన్‌రేట్ మెరుగుపరిచే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో రవిబిష్ణోయ్ వేసిన 14 ఓవర్ సెకండ్ బాల్‌ను బౌండరీ తరలించిన రోహిత్.. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని రవి బిష్ణోయ్ విడదీసాడు. సూర్యకుమార్ యాదవ్(33)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 79 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే షమీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ బౌండరీ లైన్ వద్ద ఫిన్ అలెన్‌కు చిక్కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా(1) కూడా నిరాశపరిచాడు. పూరన్ సూపర్ క్యాచ్‌కు కృనాల్ ఔటవ్వడం.. షమీ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై 131 పరుగుల స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది.