మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. లియామ్ లివింగ్ స్టోన్(42 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 77 నాటౌట్), జితేశ్ శర్మ(27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోర్ చేసింది.
ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్షద్ ఖాన్ ఓ వికెట్ తీసారు. జోఫ్రా ఆర్చర్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్ మూమెంటమ్‌ను మార్చింది. నాలుగు ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయని ఆర్చర్.. 56 పరుగులు సమర్పించుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో రూ.8 కోట్ల భారీ ధరకు జోఫ్రా ఆర్చర్‌ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ప్రభుసిమ్రాన్ సింగ్(9)ను అర్షద్ ఖాన్ పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన మాథ్యూ షార్ట్(27)తో శిఖర్ ధావన్(30) ధాటిగా ఆడాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసింది. ఆ వెంటనే రోహిత్ శర్మ తన ట్రంప్ కార్డ్ పియూష్ చావ్లాను రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాడు.
49 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విడదీసాడు. శిఖర్ ధావన్‌ను కీపర్ క్యాచ్‌గా చావ్లా పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్ది సేపటికే మాథ్యూ షార్ట్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ జట్టును ముందుకు నడిపించారు. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడిన ఈ జోడీ అనంతరం ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.
భారీ సిక్సర్లతో విరుచుకుపడిన ఈ జోడీ జట్టు స్కోర్ బోర్డును పరుగెత్తించింది. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న లివింగ్ స్టోన్.. మరింత ధాటిగా ఆడాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన 19వ ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స్‌లు బాది 27 పరుగులు పిండుకున్నాడు. ఆకాశ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చివరి ఓవర్‌లో 9 పరుగులే రావడంతో పంజాబ్ 214 పరుగులు చేసింది.