ఐపీఎల్ 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తన జోరును కొనసాగిస్తున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మ(26 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36) మెరుపులు మెరిపించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినా.. జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
మరో ఓపెనర్ ఇషాన్ కిషన్(8) విఫలమైనా.. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి చెలరేగాడు. ఇక రోహిత్ శర్మ కొట్టిన ట్రేడ్ మార్క్ పుల్ షాట్ సిక్సర్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ ఈ సూపర్ షాట్ ఆడాడు. ఈ ఓవర్ మూడో బంతిని అర్ష్‌దీప్ సింగ్ షాట్ బాల్‌గా వేయగా.. రోహిత్ శర్మ తనదైన పుల్ షాట్‌తో ఓవర్ డీప్ మిడ్ వికెట్ దిశగా 80 మీటర్ల సిక్స్ బాదాడు.

ఈ సిక్స్‌కు ఫిదా అయిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన చేతులతో తొడలు కొట్టుకుంటూ ఎంజాయ్ చేశాడు. సామ్ కరణ్, హర్షల్ పటేల్ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు బాదిన రోహిత్ శర్మ అభిమానులను అలరించాడు. ఈ సమయంలోనూ రోహిత్ శర్మ సిక్సర్లను హార్దిక్ పాండ్యా తెగ ఎంజాయ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మూడు సిక్సర్లు బాదడం ద్వారా రోహిత్ శర్మ అరుదైన ఘనతను అందుకున్నాడు.
ముంబై ఇండియన్స్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ మాజీ ప్లేయర్ కీరన్ పోలార్డ్(223 సిక్సర్లు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ(224) టాప్‌లో ఉండగా.. కీరన్ పొలార్డ్(223), హార్దిక్ పాండ్యా(104), ఇషాన్ కిషన్(103), సూర్యకుమార్ యాదవ్(97) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ అత్యధికంగా 357 సిక్సర్లు కొట్టగా.. రోహిత్ శర్మ 275 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 6500 పరుగుల మైలురాయి అందుకున్న రోహిత్ శర్మ.. ఈ ఘనతను అందుకున్న నాలుగో ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. రోహిత్ శర్మ కన్నా ముందు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ ఈ ఫీట్ సాధించారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 192 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 36), తిలక్ వర్మ(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు, సామ్ కరణ్ రెండు వికెట్లు తీయగా.. కగిసో రబడా ఓ వికెట్ పడగొట్టాడు.