చెత్త బౌలింగ్, పేలవ ఫీల్డింగ్ తమ ఓటమిని శాసించాయని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన రిషభ్ పంత్.. 20-25 పరుగులు అదనంగా ఇవ్వడం తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు.
'మేం ఎక్కువ పరుగులిచ్చాం. కీలకమైన క్యాచ్‌లను వదిలేయడం మమ్మల్ని దెబ్బతీసింది. ఆరంభంలో మా బౌలర్లు సరైన లెంగ్త్‌లో బౌలింగ్ చేయలేదు. కానీ ఆటలో ఇది సహజమే. మా ప్లేఆఫ్స్ అశలు సజీవంగానే ఉన్నాయి. తదుపరి మూడు మ్యాచ్‌లు గెలిస్తే మాకు ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది. మేం కచ్చితంగా ఈ మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించే ప్రయత్నం చేస్తాం. టాపార్డర్ మెరుగ్గా రాణిస్తున్నప్పుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయవచ్చు. అయినా ప్రతీసారి టాపార్డర్ రాణించలేదు. కొన్నిసార్లు విఫలమవుతుంది. ఇదంతా ఆటలో భాగమే. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో మేం ఏం చేయలేకపోయాం. అది మమ్మల్ని తీవ్రంగా బాధించింది.'అని రిషభ్ పంత్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 236 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(48 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో 91) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో శశాంక్ సింగ్(15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 33) మెరుపులు మెరిపించాడు. లక్నో బౌలర్లలో ఆకాశ్ సింగ్(2/30), దిగ్వేష్ రతి(2/46) రెండేసి వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 199 పరుగులు మాత్రమే చేసింది. ఆయుష్ బదోని(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74), అబ్దుల్ సమద్(24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 45) పోరాడినా ఫలితం లేకపోయింది. అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు వికెట్లు తీసాడు. మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్ చెరో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పంజాబ్.. ధర్మశాలలో విజయం సాధించింది. అంతేకాకుండా గత 11 ఏళ్లలో ఓ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ 15 పాయింట్స్ సాధించడం ఇదే తొలిసారి.