For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025 రఫ్ఫాడించిన చాహల్, మార్కో.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన పంజాబ్!

ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ముల్లాన్‌పూర్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత్కంఠగా సాగిన లో-స్కోరింగ్ గేమ్‌లో పంజాబ్ కింగ్స్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. యుజ్వేంద్ర చాహల్, మార్కో జాన్సెన్ సంచలన బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్ చారిత్రాత్మక విజయాన్నందుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రియాంశ్ ఆర్య(12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా(3/25) మూడు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్2/14), వరుణ్ చక్రవర్తీ(2/21) రెండేసి వికెట్లు పడగొట్టారు. వైభవ్ అరోరా, అన్రిచ్ నోర్జ్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం కేకేఆర్ 15.1 ఓవర్లలో 95 పరుగులు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 37), ఆండ్రీ రస్సెల్(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 17 ) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో(4/28) నాలుగు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్(3/17)మూడు వికెట్లు పడగొట్టాడు. గ్జెవియర్ బార్ట్‌లెట్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ తలో వికెట్ తీసారు.

PBKS vs KKR IPL 2025 What was the Turning Point As Punjab Beat By 16 Runs

చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్..
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌ను డిఫెండ్ చేసుకున్న జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉన్న(116/9-2009) రికార్డ్‌ను పంజాబ్ కింగ్స్(111) అధిగమించింది.

టర్నింగ్ పాయింట్..
యుజ్వేంద్ర చాహల్ సంచలన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పంజాబ్ వైపు మలుపు తిప్పాడు. నిలకడగా ఆడుతున్న అజింక్యా రహానే(17)ను ఔట్ చేసి 55 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీసిన చాహల్.. దూకుడుగా ఆడిన రఘువంశీని కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఒకే ఓవర్‌లో వరుస బంతుల్లో డేంజరస్ ప్లేయర్ రింకూ సింగ్(2)తో పాటు రమణ్‌దీప్ సింగ్(0)లను ఔట్ చేసి కేకేఆర్ పతనాన్ని శాసించాడు. చివర్లో భారీ షాట్లు ఆడిన రస్సెల్‌ను ఔట్ చేసి మార్కో జాన్సెన్ అన్‌సంగ్ హీరోగా నిలిచాడు.

దెబ్బతీసిన చాహల్
లక్ష‌చేధనలో కేకేఆర్‌కు శుభారంభం దక్కలేదు. వరుస ఓవర్లలో ఓపెనర్లు క్వింటన్ డికాక్(2), సునీల్ నరైన్(5) పెవిలియన్ చేరారు. దాంతో 7 పరుగులకే కేకేఆర్ 2 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో అంగ్‌క్రిష్ రఘువంశీ‌తో కలిసి అజింక్యా రహానే(17) ఆచితూచి ఆడాడు. రహానే స్లోగా ఆడినా రఘువంశీ బౌండరీలు బాదాడు. 55 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని చాహల్ విడదీసాడు. రహానే(17)ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ నిర్ణయాన్ని రహానే సవాల్ చేయకుండా వెనుదిరిగాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న రఘువంశీని చాహల్ తన మరుసటి ఓవర్‌లో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

చెలరేగిన జాన్సెన్..
వెంకటేశ్ అయ్య‌ర్(7)ను మ్యాక్స్‌వెల్ ఎల్బీగా ఔట్ చేయగా.. రింకూ సింగ్‌ను చాహల్ స్టంపౌట్ చేశాడు. ఆ మరుసటి బంతికే రమణ్‌దీప్ సింగ్(0) గోల్డెన్ డకౌట్ అవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. హర్షిత్ రాణాను మార్కో జాన్సెన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో కేకేఆర్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ రస్సెల్.. చాహల్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్సర్లతో పాటు ఓ బౌండరీ బాది మ్యాచ్‌ను తమవైపు తిప్పుకున్నాడు. అయితే వైభవ్ అరోరాను 9వ వికెట్‌గా అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చగా.. ఒత్తిడికి గురైన రస్సెల్.. జాన్సెన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

చెలరేగిన ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌.. ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు దూకుడుగానే ప్రారంభించారు. స్లో వికెట్‌పై ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ భారీ షాట్లతో చెలరేగారు. అయితే ప్రియాన్ష్ ఆర్యను హర్షిత్ రాణా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 39 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(0)ను కూడా హర్షిత్ రాణా క్యాచ్ ఔట్‌ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లో జోష్ ఇంగ్లీస్(2)ను వరుణ్ చక్రవర్తీ బౌల్డ్ చేయగా.. హర్షిత్ రాణా తన మరుసటి ఓవర్‌లో దూకుడుగా ఆడుతున్న ప్రభ్‌సిమ్రాన్ సింగ్(30)ను క్యాచ్ ఔట్ చేశాడు.

దెబ్బతీసిన హర్షిత్ రాణా..
హర్షిత్ రాణా తీసిన మూడు వికెట్ల క్యాచ్‌లను రమణ్‌దీప్ సింగ్ అందుకోవడం విశేషం. దాంతో పవర్ ప్లేలోనే పంజాబ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం నెహాల్ వధేరా(10)ను అన్రిచ్ నోర్జ్ ఔట్ చేయగా.. పంజాబ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. గ్లేన్ మ్యాక్స్‌వెల్(7)ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేయగా.. సుయాన్ష్ షెద్గే(4), మార్కో జాన్సెన్‌(1)లను సునీల్ నరైన్ ఒకే ఓవర్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆచితూచి ఆడిన శశాంక్ సింగ్(18) పంజాబ్ కింగ్స్ జట్టు స్కోర్‌ను 100 పరుగులు ధాటించాడు. అయితే అతన్ని వైభవ్ అరోరా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అదే ఓవర్‌లో గ్జేవియర్ బార్ట్‌లెట్‌(11) రనౌటవ్వడంతో పంజాబ్ ఇన్నింగ్స్ ముగిసింది.

టాప్-4లో పంజాబ్..
ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ తిరిగిన టాప్-4లో అడుగుపెట్టింది. మొత్తం 6 మ్యాచ్‌ల్లో పంజాబ్ 4 విజయాలు సాధించింది. గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ కూడా నాలుగేసి విజయాలతో టాప్-3లో కొనసాగుతున్నాయి. ఈ ఓటమితో కేకేఆర్ 6వ స్థానాన్ని పడిపోయింది. ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది.

Story first published: Tuesday, April 15, 2025, 22:47 [IST]
Other articles published on Apr 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+