మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. దాంతో కేకేఆర్ ముందు పంజాబ్ 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ భానుక రాజపక్స(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్
శిఖర్ ధావన్(29 బంతుల్లో 6 ఫోర్లతో 40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులు చేసింది. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్(12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 23), శిఖర్ ధావన్ ధాటిగా ప్రారంభించారు. 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో దూకుడు కనబర్చిన ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను టీమ్ సౌథీ రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేర్చినా.. క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్సా ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
ధావన్ సైతం బౌండరీలు బాదడంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. 5 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 30 బంతుల్లో రాజపక్స హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఐపీఎల్‌లో రాజపక్సకు ఇదే ఫస్ట్ ఫిఫ్టీ. ఆ వెంటనే ఉమేశ్ యాదవ్.. రాజపక్సను క్యాచ్ ఔట్‌గా పెవిలిన్ చేర్చాడు. దాంతో 2వ వికెట్‌కు నమోదైన 86 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన జితేశ్ శర్మ సైతం 2 భారీ సిక్స్‌లతో పాటు ఓ బౌండరీ బాది జోరు కనబర్చాడు. కానీ అదే జోరులో సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు.
ఆ మరుసటి ఓవర్‌లోనే హాఫ్ సెంచరీకి చేరువగా వచ్చిన శిఖర్ ధావన్‌ను వరుణ్ చక్రవర్తీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో పంజాబ్ వేగానికి బ్రేక్‌లు పడ్డాయి. అరంగేట్ర ప్లేయర్ సికిందర్ రాజా సైతం(16) ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యాడు. సామ్ కరణ్(26 నాటౌట్), షారూఖ్ ఖాన్(11 నాటౌట్) ఆఖరి ఓవర్‌లో 15 పరుగులు రాబట్టి భారీ స్కోర్ అందించారు.