మొహాలీ: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సాంకేతిక సమస్యలతో ఫ్లడ్ లైట్స్ పనిచేయకపోవడంతో కొద్దిసేపు ఆట నిలిచిపోయింది. మైదాన సిబ్బంది ఈ సమస్యను పరిష్కరించడంతో మళ్లీ తిరిగి ప్రారంభమైంది.
మ్యాచ్ ఆగిపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఐపీఎల్‌లో ఇలా సిల్లీ కారణాలతో మ్యాచ్‌లు ఆగిపోవడం సరికాదంటున్నారు.

ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. దాంతో కేకేఆర్ ముందు 192 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. ఫస్ట్ డౌన్ బ్యాటర్ భానుక రాజపక్స(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ శిఖర్ ధావన్(29 బంతుల్లో 6 ఫోర్లతో 40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ ఇద్దరూ రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించడంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేకేఆర్ బౌలర్లలో టీమ్ సౌథీ రెండు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ పడగొట్టారు.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ మన్‌దీప్ సింగ్(2)ను అర్ష్‌దీప్ సింగ్ రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేర్చాడు. దాంతో 13 పరుగులకే కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి అనుకుల్ రాయ్(4 బ్యాటింగ్) రాగా.. రెహ్మానుల్లా గుర్బాజ్(11 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నాడు.