ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు తేలిపోయారు. సాయికిషోర్(4/33) సంచలన ప్రదర్శనతో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులకు కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రాన్ సింగ్(21 బంతుల్లో 3 ఫోర్లతో 35), హర్‌ప్రీత్ బ్రార్(12 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 29), సామ్ కరణ్(19 బంతుల్లో 2 ఫోర్లతో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో సాయికిషోర్‌కు తోడుగా మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఓ వికెట్ పడగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగెత్తించారు.

52 పరుగులు జోడించిన అనంతరం ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను మోహిత్ శర్మ ఔట్ చేయగా.. క్రీజులోకి వచ్చిన రీలీ రోసౌ(9)ను నూర్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు. నిలకడగా ఆడుతున్నసామ్ కరణ్‌ను రషీద్ ఖాన్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. జితేశ్ శర్మ(13)ను సాయి కిషోర్ క్లీన్ బౌల్డ్ చేయగా.. డేంజరస్ లివింగ్‌స్టోన్(6)ను నూర్ అహ్మద్ ఔట్ చేశాడు.

అషుతోష్ శర్మ(3), శశాంక్ సింగ్(8)లను సాయి కిషోర్ పెవిలియన్ చేర్చడంతో పంజాబ్ 99 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో ఇంపాక్ట్ ప్లేయర్ హర్‌ప్రీత్ సింగ్(14), హర్షల్ పటేల్(0), కగిసో రబడాతో కలిసి హర్‌ప్రీత్ బ్రార్(29) విలువైన పరుగులు చేశాడు.