
ముంబై: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్టన్నింగ్స్ క్యాచ్‌తో ఔరా అనిపించాడు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హార్దిక్.. బౌండరీ లైన్ వద్ద కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. అయితే సమన్వయం కోల్పోయి బౌండరీ లైన్ తాకడంతో సూపర్ క్యాచ్ కాస్త.. సిక్స్‌గా మారింది. దాంతో పంజాబ్ కింగ్స్ హిట్టర్ లివింగ్ స్టోన్ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
అసలేం జరిగిందంటే..? రషీద్ ఖాన్ వేసిన 9వ ఓవర్ నాలుగో బంతిని లివింగ్ స్టోన్ లెగ్ సైడ్ భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద హార్దిక్ పాండ్యా అద్భుతంగా అందుకున్నాడు. దాంతో గుజరాత్ ఆటగాళ్లు సంబరాలు చేసుకోగా.. లివింగ్ స్టోన్ పెవిలియన్ వైపు నడిచాడు. కానీ క్యాచ్‌పై ఫీల్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. రిప్లేలో హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ తాకినట్లు తేలింది. దాంతో లివింగ్ స్టోన్ తిరిగి రాగా.. గుజరాత్ ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన లైఫ్‌తో లివింగ్ స్టోన్ చెలరేగాడు. రాహుల్ తెవాటియా బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఆ తర్వాత కూడా అదే జోరు కనబర్చగా.. రషీద్ ఖాన్ అతనికి కళ్లెం వేసాడు. మిల్లర్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే షారూఖ్ ఖాన్‌ను కూడా రషీద్ ఔట్ చేయగా.. కగిసో రబడాను షమీ రనౌట్ చేశాడు. ఇక క్రీజులోకి వచ్చి వైభవ్ అరోరా కూడా ఔటవ్వడంతో పంజాబ్ ఆలౌట్ దిశగా సాగింది. కానీ చివరి వికెట్‌కు రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్ విలువైన పరుగులు జోడించడంతో 189 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది.
లివింగ్ స్టోన్‌కు అండగా.. శిఖర్ ధావన్(30 బంతుల్లో 4 ఫోర్లతో 35), జితేశ్ శర్మ(11 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 23), రాహుల్ చాహర్(14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22 నాటౌట్) రాణించారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు తీయగా.. దర్శన్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, ఫెర్గూసన్, హార్దిక్ తలో వికెట్ తీసారు.