
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో డ్యూ ప్రభావం ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. ఇక తప్పని పరిస్థితుల్లో జట్టులో రెండు మార్పులు చేయాల్సి వచ్చిందన్న హార్దిక్... విజయ్ శంకర్, వరుణ్ అరోన్ స్థానాల్లో సాయి సుదర్శన్, దర్శన్ అరంగేట్రం చేస్తున్నారని చెప్పాడు. విజయ్ శంకర్ వెన్ను నొప్పితో బాధపడుతుంటంతోనే అతన్ని పక్కనపెట్టాల్సి వచ్చిందని పాండ్యా స్పష్టం చేశాడు. తమ జట్టు ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నానని చెప్పి పాండ్యా.. గత రెండు మ్యాచ్‌లు గెలవడంతో తమ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందన్నాడు.
టాస్ ఓడిన పంజాబ్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ సైతం ముందుగా ఫీల్డింగ్ తీసుకుందామనే ప్రణాళికతోనే వచ్చినట్లు తెలిపాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేయడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్న మయాంక్.. గత మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసే విజయం సాధించామన్నాడు. తమ ఆటగాళ్లు ఎవరి బాధ్యతలు వారు నిర్వర్తిస్తున్నారని, జట్టులో చాలా మంది సారథులు ఉండటంతో తన పని సులువు అవుతుందని చెప్పాడు. రాజపక్స స్థానంలో బెయిర్ స్టో బరిలోకి దిగుతున్నాడని మయాంక్ తెలిపాడు.
వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్‌లో కూడా విజయ ఢాంకా మోగించాలని భావిస్తోంది. మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్‌పై ఘన విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ రెట్టింపు ఉత్సాహంతో బరిలోకి దిగనుంది. ఇక జట్టు బలాబలాలు గురించి మాట్లాడుకుంటే.. ఇరు జట్లు బ్యాటింగ్ పరంగా పటిష్టంగా కన్పిస్తోన్నాయి. గుజరాత్ టైటాన్స్ విషయానికి వస్తే.. ఓపెనర్ శుభమాన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (కెప్టెన్), షారూక్ ఖాన్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), కగిసో రబాడ, ఓడెన్ స్మిత్, వైభవ్ అరోరా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్
గుజరాత్ టైటాన్స్: మాథ్యూ వెడ్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, హార్దిక్ పాండ్య (కెప్టెన్), రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, అభినవ్ మనోహర్, లూకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, సాయి సుదర్శన్, దర్శన్