ధర్మశాల: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు దుమ్మురేపారు. పృథ్వీ షా(38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), రీలే రోసౌ(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులే చేసింది.
డేవిడ్ వార్నర్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ చేసిన ఈ జోడీ.. పోటా పడి పరుగులు రాబట్టింది. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. అనంతరం అదే జోరును కనబర్చిన ఈ జోడీని సామ్ కరణ్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో విడదీసాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

క్రీజులోకి వచ్చిన రీలే రోసౌ భారీ షాట్లు ఆడగా.. పృథ్వీ షా సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పృథ్వీ షా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగినా.. ఫిల్ సాల్ట్‌తో కలిసి రీలే రోసౌ చెలరేగాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడటంతో పంజాబ్ 200 పరుగుల మార్క్‌ను ధాటింది. హర్‌ప్రీత్ బ్రార్ వేసిన చివరి ఓవర్‌లో రోసౌ రెండు సిక్స్‌లతో పాటు రెండు బౌండరీలు బాది 23 పరుగులు పిండుకున్నాడు.