ధర్మశాల: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో తుది జట్టులో చోటు కోల్పోయిన పృథ్వీ షా.. రీఎంట్రీలో హాఫ్ సెంచరీతో చెలరేగాడు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అవకాశం అందుకున్న పృథ్వీ షా.. తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. పవర్ ప్లేలో పంజాబ్ బౌలర్లను చెడుగుడు ఆడిన షా.. 36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
వెంటనే తన రెండు చేతులనూ చూపిస్తూ వినూత్న రీతిలో సంబరాలు చేసుకున్నాడు. ఇక షా వినూత్న సెలెబ్రేషన్స్ సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశమయ్యాయి. షా సెలెబ్రేషన్స్ వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని ఫ్యాన్స్ ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరికీ తోచిన విషయం వారు చెబుతున్నారు.

తమ కోచ్ పాంటింగ్‌ను ఉద్దేశించి పృథ్వీ షా అలా వినూత్నంగా సెలెబ్రేట్ చేసుకున్నాడని ఒకరంటే.. బౌన్సర్లతో తన రెండు చేతులకు గాయాలయ్యాయని, అయినా అర్థ శతకం సాధించానని చెబుతున్నాడని మరొకరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తనతో గొడవపడిన యూట్యూబర్ సప్నా గిల్‌ను ఉద్దేశించే వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడని ఇంకొందరు అంటున్నారు.
ఏది ఏమైనా పృథ్వీ షా సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ తరహాలో పృథ్వీ షా అప్పుడే బ్యాటింగ్ చేసుంటే ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరేదని అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ షా విషయంలో రికీ పాంటింగ్ తప్పు చేశాడని, అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాల్సిందని కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే హిట్టింగ్ చేసిన ఈ జోడీ.. పోటా పడి పరుగులు రాబట్టింది. దాంతో ఢిల్లీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. అనంతరం అదే జోరును కనబర్చిన ఈ జోడీని సామ్ కరణ్ శిఖర్ ధావన్ స్టన్నింగ్ క్యాచ్ సాయంతో విడదీసాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 94 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన రీలే రోసౌ భారీ షాట్లు ఆడగా.. పృథ్వీ షా సింగిల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పృథ్వీ షా క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగినా.. ఫిల్ సాల్ట్‌తో కలిసి రీలే రోసౌ చెలరేగాడు. ఈ క్రమంలో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం మరింత ధాటిగా ఆడగా పంజాబ్ 200 పరుగుల మార్క్‌ను ధాటింది.