ఐపీఎల్ 2025 సీజన్‌లో అంపైరింగ్ ప్రమాణాలపై పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న తర్వాత కూడా అంపైర్లు తప్పిదాలు చేయడం ఆమోదయోగ్యం కాదని మండిపడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
అసలేం జరిగిందంటే..?
అయితే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సందర్భంగా.. మోహిత్ శర్మ వేసిన 15వ ఓవర్‌లో శశాంక్ సింగ్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్‌పై కరుణ్ నాయర్ బంతిని అద్భుతంగా అడ్డుకున్నాడు. దాంతో సిక్సర్ కాస్త సింగిల్‌గా మారింది. అయితే బంతిని అడ్డుకునే క్రమంలో కరుణ్ నాయర్ కాలు బౌండరీ లైన్ టచ్ అయ్యింది. వెంటనే కరుణ్ నాయర్ సిక్సర్ అంటూ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సమీక్ష కోరారు.

థర్డ్ అంపైర్ క్రిస్ గఫెనే పలు కోణాల్లో రిప్లేలను పరిశీలించి.. సిక్సర్ కాదని తేల్చాడు. కరుణ్ నాయర్ కాలు బౌండరీ లైన్ తాకినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని తెలిపాడు. అయితే ఈ ఘటనపై ఎక్స్‌వేదికగా ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేసింది. కరుణ్ నాయర్ కూడా సిక్స్ అని స్పష్టం చేశాడని పేర్కొంది.
టెక్నాలజీ ఉండగా..
'ఇంత పెద్ద టోర్నీలో.. థర్డ్ అంపైర్‌కు ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉండగా.. ఇలాంటి తప్పులు చేయడం ఆమోదయోగ్యం కాదు. ఇలాంటి తప్పిదాలు జరగకూడదు. మ్యాచ్ అనంతరం కరుణ్ నాయర్‌తో మాట్లాడాను. అది ఖచ్చితంగా 6 అని అతను ధృవీకరించాడు.'అని ప్రీతి జింటా ట్వీట్ చేసింది.
ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ టాప్-2లో నిలవాలంటే.. తమ ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించాలి. అప్పుడే పంజాబ్ కింగ్స్ టాప్-2 ప్లేస్ ఖరారవుతోంది. అయితే ఆర్‌సీబీ, గుజరాత్ జట్లు తమ చివరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్‌సీబీ, గుజరాత్ తమ చివరి మ్యాచ్‌ల్లో గెలిచినా.. ఆర్‌సీబీ కంటే పంజాబ్ కింగ్స్ నెట్‌రన్‌రేట్ మెరుగ్గా ఉంటే టాప్-2 ప్లేస్ దక్కుతుంది. ముంబై ఇండియన్స్‌తో ఓడితే మాత్రం టాప్-2 ప్లే గల్లంతవుతోంది.