Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

PBKS vs DC: ప్చ్.. లివింగ్ స్టోన్ చెలరేగినా పంజాబ్‌కు తప్పని పరాజయం! ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు!

ధర్మశాల: ఐపీఎల్ 2023 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు మరో ఓటమి ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 15 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ పరాజయంతో పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను చేజార్చుకుంది. దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. పేలవ బౌలింగ్‌కు తోడు.. ఓపెనర్ల వైఫల్యం ఆ జట్టు కొంపముంచింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 213 పరుగులు చేసింది. పృథ్వీ షా(38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 54), రీలే రోసౌ(37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ వార్నర్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46), ఫిల్ సాల్ట్(14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

Liam Livingstone

పంజాబ్ బౌలర్లలో సామ్ కరణ్ ఒక్కడే 2 వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 198 పరుగులే చేసి ఓటమిపాలైంది. లియామ్ లివింగ్ స్టోన్(48 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 94) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా ఫలితం లేకపోయింది.

లివింగ్ స్టోన్‌కు తోడుగా అథర్వ టైడే(42 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 55) రాణించాడు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అన్రిచ్ నోర్జ్ రెండేసి వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీసారు.

భారీ లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్ మెయిడిన్ అవ్వగా.. ఇషాంత్ శర్మ వేసిన రెండో ఓవర్ తొలి బంతికే శిఖర్ ధావన్(0) క్యాచ్ ఔట్‌గా గోల్డెన్ డక్ అయ్యాడు. క్రీజులోకి వచ్చిన అథర్వ టైడే, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

పవర్ ప్లే అనంతరం అక్షర్ పటేల్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్(22)ను పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్‌తో అథర్వ టైడే ఆచితూచి ఆడాడు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించిన ఈ జోడీ.. ఢిల్లీ ఫీల్డర్ల తప్పిదంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. లివింగ్ స్టోన్, అథర్వ ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేసిన ఢిల్లీ ఫీల్డర్లు సునాయ రనౌట్ అవకాశాలను కూడా చేజార్చారు.

ఈ అవకాశాలతో చెలరేగిన అథర్వ, లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అనంతరం అథర్వ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగ్గా సామ్ కరణ్ క్రీజులోకి వచ్చాడు. లివింగ్ స్టోన్ భారీ సిక్స్‌లు బాదినా జితేశ్ శర్మ(0), సామ్ కరణ్(11), హర్‌ప్రీత్ బ్రార్(0) ఔటవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మళ్లింది.

కానీ ఇషాంత్ శర్మ వేసిన చివరి ఓవర్‌లో పంజాబ్ విజయానికి 33 పరుగులు అవసరమవ్వగా.. ఇషాంత్ శర్మ 0, 6, 4, 6 నోబాల్ వేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. కానీ చివరి మూడు బంతులను కట్టుదిట్టంగా వేసిన ఇషాంత్ శర్మ ఢిల్లీకి విజయాన్నందించాడు.

Story first published: Wednesday, May 17, 2023, 23:30 [IST]
Other articles published on May 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+