
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు దుమ్మురేపారు. వరుసగా వికెట్లు తీసి ఆ జట్టును కోలుకోలేని దెబ్బతీసారు. దాంతో పంజాబ్ కింగ్స్.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 115 పరుగులకు కుప్పకూలింది. యువ ప్లేయర్ జితేశ్ శర్మ(23 బంతుల్లో 5 ఫోర్లు 32), మయాంక్ అగర్వాల్(15 బంతుల్లో 4 ఫోర్లతో 24) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ రెండేసి వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఇన్నింగ్స్ ఆరంభంలోనే పంజాబ్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(9)ను పంత్ సూపర్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ కొద్దిసేపటికే బౌండరీలతో జోరు కనబర్చిన మయాంక్ అగర్వాల్‌ను ముస్తాఫిజుర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే విధ్వంసకర బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్ స్టోన్(2)ను అక్షర్ పటేల్ స్టంపౌట్ చేశాడు. దాంతో పంజాబ్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి 47 రన్స్ చేసింది.
పవర్ ప్లే అనంతరం జానీ బెయిర్ స్టో(9)ను ఖలీల్ అహ్మద్ క్యాచ్ ఔట్ చేయగా.. బౌండరీలతో జోరు కనబర్చిన జితేశ్ శర్మను అక్షర్ పటేల్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. దాంతో పంజాబ్ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. రబడా(2), నాథన్ ఎల్లిస్(0), రాహుల్ చాహర్(12), అర్ష్‌దీప్ సింగ్(9)కూడా విఫలమవడంతో 115 పరుగులకే కుప్పకూలింది.