
ముంబై: ఐపీఎల్ కెరీర్‌లో 200వ మ్యాచ్ ఆడుతున్న శిఖర్ ధావన్(59 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్ ముందు పంజాబ్ కింగ్స్ 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. శిఖర్ ధావన్‌కు తోడుగా భానుక రాజపక్స(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 42) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చివర్లో లివింగ్ స్టోన్(7 బంతుల్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో 19) మెరుపులు మెరిపించాడు. చెన్నై బౌలర్లలో డ్వేన్ బ్రావో రెండు వికెట్లు తీయగా.. మహీశ్ తీక్షణ ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్‌కు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్(18) మరోసారి విఫలమయ్యాడు. తీక్షణ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో పవర్ ప్లేలో పంజాబ్ వికెట్ నష్టానికి 37 పరుగులే చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన భానుక రాజపక్స సాయంతో శిఖర్ ధావన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇక జడేజా వేసిన 7వ ఓవర్‌లో రాజపక్స ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను గైక్వాడ్ నేలపాలు చేశాడు. ఆ తర్వాత జడేజా వేసిన మరుసటి ఓవర్‌లోనూ రాజపక్సకు లైఫ్ లభించింది. అతను ఇచ్చిన మరో క్యాచ్‌ను మిచెల్ సాంట్నర్ బౌండరీ లైన్ వద్ద నేలపాలు చేశాడు. క్యాచ్ వదిలేయడంతో పాటు సిక్సర్‌ను ఆపలేకపోయాడు.
ఈ అవకాశాలతో చెలరేగిన రాజపక్స.. చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖేచౌదరీ బౌలింగ్‌లో ధావన్ మూడు బౌండరీలు బాదగా.. ప్రిటోరియస్ ఓవర్‌లో రాజపక్స సిక్సర్ కొట్టడంతో పంజాబ్ స్కోర్ బోర్డు వేగం పెరిగింది. అదే ఓవర్‌లో ధావన్ బౌండరీ బాది కెరీర్‌లో 46వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక హాఫ్ సెంచరీకి చేరువైన రాజపక్సను డ్వేన్ బ్రావో క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 110 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత లియామ్ లివింగ్ స్టోన్ క్రీజులోకి రాగా.. ధావన్ ధాటిగా ఆడాడు. ప్రిటోరియస్ వేసిన 19వ ఓవర్‌లో లివింగ్ స్టోన్ 4, 6, 6 కొట్టగా.. ధావన్ బౌండరీ బాదడంతో 22 పరుగులు వచ్చాయి. బ్రావో వేసిన చివరి ఓవర్‌లో తొలి బంతికే లివింగ్ స్టోన్ ఔటవ్వగా.. ధావన్ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. జానీ బెయిర్ స్టో ఓ బౌండరీ బాదడంతో 13 పరుగులే వచ్చాయి.