టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ బ్యాటింగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. సంజూ బ్యాటింగ్ చాలా అద్భుతంగా ఉంటుందని కొనియాడాడు. భారత ఆటగాళ్లలో కోహ్లీ, రోహిత్, రిషభ్ పంత్ ఆట ఇష్టమే అయినా.. టీ20ల్లో సంజూ శాంసన్ బ్యాటింగ్ చూడటాన్ని చాలా ఇష్టపడుతానని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలం ముంగిట రికీ పాంటింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తమ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి తప్పుకున్న పాంటింగ్.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2025 మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు రిటెన్షన్ ప్రక్రియపై ఫోకస్ పెట్టాడు.

తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ తరం భారత ఆటగాళ్లలో తన ఫేవరేట్ ప్లేయర్లు ఎవరో చెప్పాడు. 'భారత ఆటగాళ్లలో నాకు నచ్చేవారు చాలా మంది ఉన్నారు. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, విరాట్ కోహ్లీల ఆటను ఇష్టపడుతాను. కానీ సంజూ శాంసన్ అనే మరో ఆటగాడు ఉన్నాడు. మీరంతా అతని ఆటను ఎంత ఆస్వాదిస్తారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం టీ20ల్లో సంజూ బ్యాటింగ్‌ను బాగా ఇష్టపడుతాను.'అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రూ. 18 కోట్లు పలికే ఆటగాడు జట్టులో ఎవరున్నారా? అనేది చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కరణ్‌తో పాటు లియామ్ లివింగ్ స్టోన్, అర్ష్‌దీప్ సింగ్‌లను పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఆదేశించింది. అంతేకాకుండా అదే రోజు (అక్టోబర్ 31(గురువారం)) సాయంత్రం 5 గంటల నుంచి ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమా.. రిటెన్షన్ జాబితాలను అధికారికంగా ప్రకటించనున్నాయి.