
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్‌గా 2023 వరకు పేటీఎం కొనసాగనుంది. ఈ మేరకు బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. బీసీసీఐ నిర్వహించే అన్ని అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌ల టైటిల్ స్పాన్సర్‌గా మొబైల్ పేమెంట్స్, ఈ కామర్స్ కంపెనీ అయిన వన్ 97 కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్వవహారించనుందని పేర్కొంది.
టైటిల్ స్పాన్సర్ కోసం నిర్వహించిన వేలంలో పాల్గొన్న వన్ 97 కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ రూ.326.80 కోట్లకు హక్కులను దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం 2019 నుంచి 2023 వరకు పేటీఎం టైటిల్ స్పాన్సర్‌గా కొనసాగనుంది. 2015లో ఇదే టైటిల్ స్పాన్సర్ కోసం పేటీఎం రూ. 203.28 కోట్లను చెల్లించడం విశేషం.
ఈ ఒప్పందంపై బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీ మాట్లాడుతూ "బీసీసీఐ టైటిల్ స్పాన్సర్‌గా పేటిఎం ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది. భారత్‌లో ఎదుగుతున్న కొత్త జనరేషన్ కంపెనీల్లో పేటిఎం ఒకటి. భారత క్రికెట్‌తో పేటిఎం తన సంబంధాన్ని కొనసాగించడం మాకు ఎంతో గర్వంగా ఉంది" అని తెలిపారు.
ఫోటో ప్లీజ్: విండిస్‌తో తొలి టెస్టుకు భారత ఆటగాళ్లు ధరించే కొత్త జెర్సీ ఇదే
పేటిఎం వ్యవస్తాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్ శర్మ మాట్లాడుతూ "బీసీసీఐ, టీమిండియాతో మా సంబంధాన్ని కొనసాగించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతీ సీజన్‌లో భారత క్రికెట్‌పై మాకున్న నిబద్ధత మరింత బలపడుతోంది. భారతీయులు క్రికెట్‌ని ఇష్టపడతారు. పేటిఎంలో ఉన్న వాళ్లకి కూడా క్రికెట్ అంటే ఇష్టం" అని అన్నారు.