బ్యాటింగ్ వైఫల్యంతో పాటు ప్రణాళికలకు తగ్గట్లు ఆడకపోవడమే తమ ఓటమిని శాసించిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసిందని చెప్పాడు. ఏదో ఒక మ్యాచ్‌లో ఏది కలిసి రాదని, ఈ మ్యాచ్ కూడా అలాంటిదేనని తెలిపాడు. ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా సోమవారం ముగిసిన తొలి టెస్ట్‌లో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.
ఆసీస్ గడ్డపై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. 534 పరుగుల భారీ లక్ష్యచేధనతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 238 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్ మూడేసి వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు పడగొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణాకు తలో వికెట్ దక్కింది.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్... తప్పిదాలపై ఫోకస్ పెట్టి అడిలైడ్ వేదికగా జరిగే రెండో టెస్ట్‌కు సిద్దమవుతామని తెలిపాడు. తమ వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయామన్నాడు.
'ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ మ్యాచ్ కోసం మేం బాగానే సన్నదమయ్యాం. జట్టులోని ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా కనిపించారు. కానీ వ్యూహాలను సరిగ్గా అమలు చేయలేకపోయాం. ఇదే మా ఓటమిని శాసించింది. రెండు రోజులు విశ్రాంతి తీసుకొని అడిలైడ్‌లో ప్రాక్టీస్ మొదలు పెడుతాం. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాం. తొలి టెస్ట్‌లో చేసిన తప్పిదాలపై చర్చిస్తాం.
ఈ మ్యాచ్‌లో మాకు ఏది కలిసిరాలేదు. రెండో రోజు నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా తొలి రోజు ఆటలో మా బ్యాటింగ్ వైఫల్యం తీవ్ర నష్టం చేసింది. ఆ రోజు మేం బ్యాట్‌తో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. జట్టులో చాలా మంది అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. టీమ్ ఓటమికి దారితీసిన కారణాలను విశ్లేషిస్తాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ సందర్భంగా సరదా ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ అనంతరం బుమ్రా, కమిన్స్.. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్‌కు సిద్దమయ్యారు. ఇద్దరు ముచ్చట్లో మునిగిపోయారు. హోస్ట్ ఆడమ్ గిల్ క్రిస్ట్.. ప్యాట్ కమిన్స్‌ను పిలవగా.. అతను వినిపించుకోలేదు. బుమ్రాతో మాటల్లో లీనమయ్యాడు. వెంనటే బుమ్రా పిలుస్తున్నారని చెప్పడంతో అప్పుడు వచ్చి ఓటమికి గల కారణాలు చెప్పాడు.
సంక్షిప్త స్కోర్లు:
భారత్ తొలి ఇన్నింగ్స్ 150 ఆలౌట్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 104 ఆలౌట్
భారత్ మూడో ఇన్నింగ్స్ 487/6 డిక్లేర్డ్
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 238 ఆలౌట్