
మొహాలీ: జట్టులో స్టార్ ఆటగాళ్లు లేరని తమ టీమ్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ భారత ఆటగాళ్లను హెచ్చరించాడు. మూడు టీ20ల సిరీస్ కోసం భారత్‌కు వచ్చిన ఆస్ట్రేలియా.. మొహాలీ వేదికగా మంగళవారం తొలి మ్యాచ్ ఆడనుంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి ఈ టీ20 సిరీస్ నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) రెస్ట్ ఇచ్చింది. అలానే గాయాల కారణంగా మిచెల్ మార్ష్, మార్కస్ స్టాయినిస్, ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఈ సిరీస్‌కి దూరమైపోయారు. దాంతో ఆస్ట్రేలియా టీమ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. కానీ అంతమాత్రానా లైట్ తీసుకోవద్దని.. మేము గెలిచేందుకే ఇక్కడికి వచ్చినట్లు పాట్ కమిన్స్ స్పష్టం చేశాడు.
తొలి మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పాట్ కమిన్స్.. తమని తేలికగా తీసుకోవద్దని భారత్ జట్టుకి వార్నింగ్ ఇచ్చాడు. 'మమ్మల్ని తేలికగా తీసుకోకండి. మేము ఇక్కడికి గెలిచేందుకే వచ్చాం. నిజమే.. కొంత మంది ప్లేయర్లు వివిధ కారణాలతో టీమ్‌కు దూరమయ్యారు. కానీ అంతమాత్రానా మా టీమ్‌ను లైట్‌గా తీసుకునే అవకాశం ఎవరికీ ఇవ్వబోం.'అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియా వేదికగానే టీ20 వరల్డ్‌కప్ 2022 జరగనుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ గెలవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది.
ఫస్ట్ టీ20 మ్యాచ్ మొహాలిలో జరగనుండగా.. ఆ తర్వాత రెండు టీ20లకి నాగ్‌పూర్ (శుక్రవారం), హైదరాబాద్ (ఆదివారం) ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టీ20 ప్రపంచకప్‌నకు ముందు బ్యాటింగ్, బౌలింగ్ ఆర్డర్‌ను సెట్‌ను చేసుకోవడానికి భారత్‌కు మంచి తరుణం. సీనియర్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయం నుంచి కోలుకొని వచ్చాడు. అలాగే యువ బౌలర్ హర్షల్ పటేల్ కూడా జట్టుతో చేరాడు. వీరిద్దరూ టీ20 ప్రపంచకప్ జట్టులోనూ ఉన్నారు. దీంతో చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగుతున్న బుమ్రా, పటేల్ ఎలా రాణిస్తారనేది వేచి చూడాలి. ప్రపంచకప్ నాటికి బౌలింగ్ లయను అందుకోవాలని భారత్ ఆశిస్తోంది.