ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ప్రదర్శనతో పాటు తమ బ్యాటింగ్ వైఫల్యంతోనే ఓటమిపాలయ్యామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
సూర్యకుమార్ యాదవ్(51 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 102 నాటౌట్) విధ్వంసకర శతకంతో ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. బ్యాటింగ్‌లో కొన్ని పరుగులు తక్కువగా చేయడం ఓటమిని శాసించిందని చెప్పాడు.

'మేం కొన్ని పరుగులు తక్కువ చేశాం. వాంఖడే మైదానంలో ఎప్పుడైన వీలైనన్ని పరుగులు ఎక్కువ చేయాలి. అప్పుడే మనం మ్యాచ్‌లో ఉన్నామనే భావన కలుగుతోంది. పిచ్ నుంచి బౌలింగ్‌లో అడ్వాంటేజ్ లభించడంతో మ్యాచ్ రేసులో నిలిచాం. సన్వీర్ సాయంతో మేం 170 పరుగుల మార్క్‌ను అందుకున్నాం.
వాస్తవానికి మేం ఇంపాక్ట్ ప్లేయర్‌గా బౌలర్‌ను ఆడించాలనుకున్నాం. టీ20 క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సూర్య అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. మాకు హోమ్ గ్రౌండ్‌లో ఆడిన అనుభూతే కలిగింది. తదుపరి మ్యాచ్‌ల కోసం అన్ని విధాలుగా సిద్దమవుతాం. మరిన్ని మెరుగైన వ్యూహాలతో బరిలోకి దిగుతాం.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 173 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్(30 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 48), ప్యాట్ కమిన్స్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2సిక్స్‌లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా, పియూష్ చావ్లా మూడేసి వికెట్లు తీయగా.. బుమ్రా, అన్షుల్ కంబోజ్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 17.2 ఓవర్లలో 3 వికెట్లకు 174 పరుగులు చేసి గెలుపొందింది. సూర్యకు తోడుగా తిలక్ వర్మ(32 బంతుల్లో 6 ఫోర్లతో 37 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 143 పరుగులు జోడించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ప్యాట్ కమిన్స్ తలో వికెట్ తీసారు.
ఈ ఓటమితో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. చివరి మూడు మ్యాచ్‌ల్లో ఆ జట్టు రెండు గెలవాల్సిన పరిస్థితి నెలకొంది.