కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో పాటు పేలవ బ్యాటింగ్ తమ ఓటమిని శాసించిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్)తో ఆదివారం జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ పరాజయంతో టైటిల్ గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. కోల్‌కతా నైట్‌రైడర్స్ అసాధారణ ప్రదర్శనే తమ విజయవకాశాలను దెబ్బతీసిందన్నాడు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1 మాదిరే ఫైనల్లోనూ ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నాడు.

ఈ గెలుపు క్రెడిట్ పూర్తిగా కేకేఆర్ బౌలర్లదేనని చెప్పాడు.'కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. మేం బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాం. మా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాం. కేకేఆర్ బౌలర్ల ధాటికి పూర్తిగా చేతులెత్తేసాం. వారు ఏ దశలోనూ మాకు అవకాశం ఇవ్వలేదు. అహ్మదాబాద్ మాదిరే మరోసారి మమ్మల్ని మట్టికరిపించారు.
ఇది చాలా కఠినమైన వికెట్. ఇది ఏ మాత్రం 200 ప్లస్ రన్స్ చేయాల్సిన వికెట్ కాదు. మేం 160 పరుగులు చేసుంటే పోరాడేందుకు అవకాశం లభించేది.
ఈ సీజన్‌లో మాకు చాలా సానుకూలంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మా బ్యాటింగ్ చాలా భీకరంగా సాగింది. 250 ప్లస్ రన్స్‌ను మేం మూడు సార్లు చేశాం. ఇది మాకు చాలా గొప్ప సీజన్.
జట్టులోని చాలా మందితో నేను ఇంతకుముందు ఎప్పుడూ ఆడలేదు. కలిసి పనిచేయలేదు. సన్‌రైజర్స్ అద్భుతమైన జట్టు. సపోర్ట్ స్టాఫ్ కూడా అసాధారణ పనితీరు కనబర్చారు. ఈ టోర్నీ మాకు అద్భుతంగా సాగింది. భారత్‌లో మేం చాలా మ్యాచ్‌లు ఆడినా.. అవి టీమిండియా ఫ్యాన్స్ ముందు ఆడినవే. కానీ ఐపీఎల్ కారణంగా మాకు మద్దతుగా నిలిచిన అభిమానుల మధ్య ఆడే అవకాశం దక్కింది.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఫెయిర్ ప్లే టీమ్ అవార్డు కూడా లభించింది. ఉప్పల్ మైదానానికి బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డ్ దక్కింది. ఈ అవార్డ్ కింద రూ. 50 లక్షల క్యాష్ రివార్డ్ ఉప్పల్ మైదానానికి లభించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఎయిడెన్ మార్క్‌రమ్(23 బంతుల్లో 3 ఫోర్లతో 20), ప్యాట్ కమిన్స్(19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీయగా.. ఆండ్రీ రస్సెల్(3/19) మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్లకు 114 పరుగులు చేసి 57 బంతులు మిగిలి ఉండగానే సునాయస విజయాన్నందుకుంది. సునీల్ నరైన్(6) విఫలమైనా.. రెహ్మానుల్లా గుర్బాజ్(32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39), వెంకటేశ్ అయ్యర్(26 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 నాటౌట్) సత్తా చాటారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, షెహ్‌బాజ్ అహ్మద్ తలో వికెట్ తీసారు.