లక్నో: వన్డే ప్రపంచకప్ 2023లో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో విజయాన్నందుకోవడం సంతోషంగా ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తెలిపాడు. రెండు వరుస పరాజయాల తర్వాత దక్కిన ఈ విజయం.. ఎంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆసీస్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. ఈ గెలుపు క్రెడిట్ బౌలర్లదేనని చెప్పాడు. ఈ పిచ్‌పై 300 పరుగుల లక్ష్యం నమోదు చేసుంటే చేధించడం కష్టమయ్యేదని తెలిపాడు. వరుస పరాజయాల నేపథ్యంలో వచ్చిన విమర్శలను తాము అస్సలు పట్టించుకోమని స్పష్టం చేశాడు.

'ఈ రోజు ఎంతో సంతోషంగా ఉంది. రెండు వరుస పరాజయాల తర్వాత దక్కిన ఈ విజయం గొప్ప అనుభూతినిస్తోంది. మైదానంలో మా ఆటగాళ్ల శక్తి అద్భుతం. ప్రతీ ఒక్కరూ ఉత్సాహంగా కనిపించారు. శ్రీలంక అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. కానీ మా బౌలర్లు అసాధారణ ప్రదర్శనతో వికెట్లు పడగొట్టారు. బంతితో గొప్ప పోరాటం కనబర్చారు.
ఈ తరహా వికెట్లను నేను అర్థం చేసుకోలేను. ఈ పిచ్‌పై 300 పరుగుల లక్ష్యం చాలా కష్టం. బయట వ్యక్తుల మాటలు, విమర్శలను మేం అస్సలు పట్టించుకోం. అన్ని విభాగాల్లో మా ఆటగాళ్లు సత్తా చాటారు. ఇదే జోరును తదుపరి మ్యాచ్‌ల్లోనూ కొనసాగిస్తామని ఆశిస్తున్నా'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 43.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక ఓపెనర్లు పాతుమ్ నిస్సంక(67 బంతుల్లో 8 ఫోర్లతో 61), కుశాల్ పెరీరా(82 బంతుల్లో 12 ఫోర్లతో 78) హాఫ్ సెంచరీల రాణించగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా(4/47) నాలుగు వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించాడు.
మిచెల్ స్టార్క్(2/43), ప్యాట్ కమిన్స్(2/32) రెండేసి వికెట్లు తీసారు. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు ఓ వికెట్ దక్కింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆసీస్.. 35.2 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. మిచెల్ మార్ష్(67 బంతుల్లో 9 ఫోర్లతో 51), జోష్ ఇంగ్లీస్(59 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు.
మార్నస్ లబుషేన్(60 బంతుల్లో 2 ఫోర్లతో 40), గ్లేన్ మ్యాక్స్‌వెల్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక మూడు వికెట్లు తీయగా.. దునిత్ వెల్లలాగే ఓ వికెట్ పడగొట్టాడు.