చెత్త షాట్లే తమ పతనాన్ని శాసించాయని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. బ్యాటింగ్ వైఫల్యంతో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయామని అంగీకరించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 163 పరుగులకు కుప్పకూలింది. అనికేత్ వర్మ(41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 74), హెన్రీచ్ క్లాసెన్(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచెల్ స్టార్క్(5/35) ఐదు వికెట్లతో చెలరేగాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 16 ఓవర్లలోనే 3 వికెట్లకు 166 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫాఫ్ డుప్లెసిస్(27 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో జీషన్ అన్సారీ(3/42) ఒక్కడే మూడు వికెట్లు తీసాడు.

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ప్యాట్ కమిన్స్.. గత రెండు మ్యాచ్‌ల్లో తమకు ఏది కలిసి రాలేదన్నాడు. ఈ వరుస ఓటములపై సమీక్ష చేస్తామని, జట్టులోని మిగతా ఆప్షన్స్‌ను పరిశీలిస్తామని తెలిపాడు. 'ఆశించిన రీతిలో మా బ్యాటింగ్ సాగలేదు. సరైన లక్ష్యాన్ని నమోదు చేయలేకపోయాం. కొన్ని చెత్త షాట్లు మా జట్టును దెబ్బతీసాయి. డీప్‌లో క్యాచ్‌లు అందుకోవడం ఈ ఫార్మాట్‌లో సర్వ సాధారణమే. అయితే ఇది ఘోర పరాజయమని నేను అనుకోను.
గత రెండు మ్యాచ్‌ల్లో మాకు ఏదీ కలిసి రాలేదు. ఈ పరాజయాలపై సమీక్ష చేస్తాం. జట్టులోని విభిన్నమైన ఆప్షన్స్‌ను పరిశీలిస్తాం. అనికేత్ వర్మ అద్బుతంగా ఆడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లోనే జట్టులోని ప్రతీ ఒక్కరిని తన ఆటతో ఆకట్టుకున్నాడు. ఈ ఓటములకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టోర్నీ ఆరంభంలోనే ఉన్నాం. తదుపరి మ్యాచ్‌లో పుంజుకుంటాం. అయితే నేను ముందుగా చెప్పినట్లు మా కాంబినేషన్‌లోని ఆప్షన్స్‌ను పరిశీలించాలి.'అని ప్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.