
సిడ్నీ: సంప్రదాయక ఫార్మాట్‌లో భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాకు బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఆస్ట్రేలియా స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ గెలిచిన(2018-19) చారిత్రాత్మక సిరీస్‌లో ఈ టీమిండియా నయావాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 521 పరుగులతో ఆసీస్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్(ఏసీఏ) నిర్వహించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఆన్ లైన్ సెషన్‌లో టఫెస్ట్ బౌలర్ ఎవరనీ కమిన్స్‌ను ప్రశ్నించగా.. అతను పుజారా పేరును చెప్పాడు. ముఖ్యంగా 2018-19 సిరీస్‌లో తమను ఎంతగానో ఇబ్బంది పెట్టాడని ఈ వరల్డ్ నెంబర్ వన్ టెస్ట్ బౌలర్ చెప్పుకొచ్చాడు.
'చాలా మంది ఉన్నారు. కానీ ఒకరు పేరు చెబుతాను. అతడే టీమిండియా బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా. అతడు మమ్మల్నిఎంతో కష్టపెట్టాడు. ఆ సిరీస్‌లో పుజార చాలా బాగా ఆడాడు. అతడిని ఔట్ చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రతిరోజు ఎంతో ఏకాగ్రతగా ఆడతాడు. నేను బౌలింగ్ చేసిన వాళ్లతో పుజారనే కఠినమైన బ్యాట్స్‌మన్' అని కమిన్స్ సమాధానమిచ్చాడు.
ఇక 2018-19 సిరీస్‌లోనైతే అతన్ని ఔట్ చేయడం తమకు తలకు మించిన భారమైందన్నాడు. పుజారా కూడా రోజు రోజుకు మరింత మెరుగదల చూపిస్తూ తమ సహానానికి పరీక్షగా నిలిచాడన్నాడు. ఇక కమిన్స్ వ్యాఖ్యలతో నాథన్ లియోన్, జోష్ హజల్ వుడ్ కూడా ఏకీభవించారు. తమ ఓటమికి ప్రధాన కారణం పుజారాను త్వరగా ఔట్ చేయకపోవడమేనని ఈ స్టార్ క్రికెటర్లు చెప్పుకొచ్చారు. అద్భుత బ్యాటింగ్‌తో ఆసీస్ పతనాన్ని శాసించిన పుజారా బ్యాటింగ్‌ను ప్రతీ ఒక్కరు కొనియాడారు. ఆ సిరీస్‌లో భారత్-ఆస్ట్రేలియాకు ఉన్న తేడా పుజారనేనని విశ్లేషించారు.