Pat Cummins: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఇప్పటికే ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మొత్తానికి దూరమైన ఆరెంజ్ ఆర్మీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఐపీఎల్ 2026 ఆడటంపై కూడా సందేహాలు నెలకొన్నాయి. తాను ఐపీఎల్ 2026 ఆడే విషయంపై అనిశ్చితి నెలకొందని, అందుబాటులో ఉంటానా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేనని ప్యాట్ కమిన్స్ తెలిపాడు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ప్యాట్ కమిన్స్.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతోనే టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి దూరమయ్యానని తెలిపాడు. 'అడిలైడ్ టెస్ట్ మ్యాచ్ తర్వాత గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి 8 వారాల సమయం పడుతుందని తెలుసు.
మొదట్లో చాలా బాగున్నట్లు అనిపించడంతో నాలుగు వారాల్లో రికవరీ అవుతానని భావించా. కానీ తదుపరి స్కానింగ్ తర్వాత గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి మరో రెండు వారాలు అవసరమని తేలింది. ఈ క్రమంలోనే టీ20 ప్రపంచకప్ 2026 ఆడే విషయంలో రిస్క్ తీసుకోలేదు. ఐపీఎల్ 2026 ఆడే విషయాన్ని కూడా ఇప్పుడే ఎటూ తేల్చలేను.'అని కమిన్స్ చెప్పుకొచ్చాడు.

దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ప్యాట్ కమిన్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ అతను ఐపీఎల్‌కు దూరమైతే హైదరాబాద్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ముఖ్యంగా జట్టులో సీనియర్లు ఎవరూ లేరు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌కు టైటిల్ అందించిన ఇషాన్ కిషన్‌కే కెప్టెన్సీ పగ్గాలు దక్కనున్నాయి. అతనికి మించి మరో ఆప్షన్ కనబడటం లేదు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చాలా తెలివిగా వ్యవహరించింది. రూ.25.5 కోట్ల భారీ పర్స్‌తో బరిలోకి దిగిన ఆరెంజ్ ఆర్మీ.. మొత్తం 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అత్యధికంగా ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌కు రూ.13 కోట్లు ఖర్చు చేసిన కావ్య మారన్.. ఆస్ట్రేలియా అనామక పేసర్ జాక్ ఎడ్వర్డ్స్‌ను రూ.3 కోట్లకు తీసుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసిన 10 మందిలో 9 మంది అనామక ఆటగాళ్లే కావడంతో ఆ జట్టు అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. కానీ జట్టు బలహీనతలను అధిగమించేందుకు సన్‌రైజర్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న ఆటగాళ్లను అన్వేషించి కొనుగోలు చేసింది. ముఖ్యంగా బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేసింది.
సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).
ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, ఆర్ సమరన్, ఇషాన్ కిషన్, హెన్రీచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కామిందు మెండీస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్స్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్, ఇషాన్ మలింగా, జీషన్ అన్సారీ.