
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్(జేకేసీఏ)తో కలిసి తాను పనిచేయలేనని టీమిండియా క్రికెటర్ పర్వేజ్ రసూల్ అన్నాడు. అసోసియేషన్ అధికారులు కొందరూ కావాలనే తన పేరు బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశాడు. తాజాగా పర్వేజ్ రసూల్‌పై పిచ్ రోలర్ దొంగతనం చేశాడనే ఆరోపణలు వచ్చాయి. దాంతో తీవ్ర ఆవేదనకు గురైన అతను జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌తో కలిసి పనిచేయలేనని, ఈ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జోక్యం చేసుకోవాలని కోరాడు. జమ్మూ కశ్మీర్ క్రికెట్ గ్రౌండ్ కోసం తాను సొంత డబ్బులు ఖర్చు చేశానని, అలాంటిది దొంగతనం ఎందుకు చేస్తానని ప్రశ్నించాడు. తాజాగా ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ చానెల్‌తో మాట్లాడిన పర్వేజ్ రసూల్.. పిచ్ రోలర్ ఎత్తుకెళ్లడానికి అదేం టెన్నిస్ బాల్ కాదని ఆవేదనను వ్యక్తం చేశాడు.
'ఈ దొంగతనం విషయంలో బీసీసీఐ కలగజేసుకొని నా పనితీరును గమనించాలి. వ్యక్తిగతంగా ఇక్కడ నేను క్రికెట్ అభివృద్ధి కోసం పాటుపడుతున్నా. జమ్మూ కశ్మీర్ గ్రౌండ్ కోసం నా సొంత డబ్బులు ఖర్చుచేశా. అలాగే రోజువారీ ఖర్చుల కోసం సహాయం చేశా. నేను ఎవరి వద్ద డబ్బులు తీసుకోను. ఆటగాళ్లకూ నావంతు సహాయం చేస్తా. అలాంటిది పిచ్ రోలర్‌ను ఎలా తీసుకెళ్తా? అదేం టెన్నిస్ బంతి కాదు జేబులో వేసుకొని వెళ్లడానికి. అది క్రికెట్ మైదానం కోసం పనికొస్తుంది. ఇలా ఎందుకు జరిగిందో అర్థంకావడంలేదు. ఇప్పుడు నాకు రెండోసారి నోటీసులు పంపారని చెబుతున్నారు. అంతకుముందు జులై 5న తొలిసారి పంపారని చెప్పారు. కానీ ఆరోజు నాకెలాంటి నోటీసులు అందలేదు' అని రసూల్ పేర్కొన్నాడు.
ఉద్దేశ పూర్వకంగానే తనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని రసూల్ ఆరోపించాడు. ఓ అధికారి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రాసుకొచ్చాడని, ఆ తర్వాత తన కామెంట్స్ విని తొలగించాడని రసూల్ చెప్పుకొచ్చాడు. ఆ అధికారి పోస్ట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్ తన దగ్గర ఉందని, అసలు తనను ఇంత బద్నాం చేయడానికి చేసిన తప్పేంటో చెప్పాలన్నాడు. తానేమైనా తప్పుచేసినట్లు సందేహపడితే ఫోన్ చేయాల్సిందని, వారి దగ్గర నంబర్ కూడా ఉందన్నాడు. రెండు సెకన్లలో తేలిపోయే విషయాన్ని రాద్దంతం చేసి బద్నాం చేయాలని చూశారని రసూల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇక పర్వేజ్ రసూల్ భారత్ తరఫున ఏకైక వన్డే, టీ20 మ్యాచ్ ఆడాడు. తద్వారా జమ్మూ కశ్మీర్ నుంచి భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. 2014లో బంగ్లాదేశ్‌లో ఏకైక వన్డే ఆడిన పర్వేజ్.. 2017లో ఇంగ్లండ్‌తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్‌లో 11 మ్యాచ్‌లు ఆడాడు.