
రోహిత్ కెప్టెన్సీ సూపర్..
‘జట్టును ఎలా నిర్మించాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు. టోర్నీలు ఎలా గెలవాలో కూడా చూపించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా టీ20 ఫార్మాట్ బాధ్యతలను అతనికి అప్పగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అలా చేస్తే విరాట్ కోహ్లీపై ఉన్న భారం కూడా తగ్గుతుంది. రోహిత్‌తో కలిసి చాలా టోర్నీలు గెలిచాం. ఒత్తిడిలో అతను తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. ఇక ముంబై ఇండియన్స్‌కు ఎప్పుడూ సమతూకమైన జట్టు ఉండదు. కానీ ఆటగాళ్లందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఫలితాలు ఎలా సాధించాలో రోహిత్ చూపించాడు. భారత జట్టు కెప్టెన్సీ విషయంలో ఇద్దరికీ అవకాశం ఉంది. ఐపీఎల్‌తో ఇది స్పష్టమైంది. ఈ టీ20 టోర్నీ వల్ల ఎవరి ప్రతిభ ఏమిటో తెలిసింది.'అని పార్థీవ్ చెప్పుకొచ్చాడు.

రాణించినా ఎంపిక చేయలేదు..
ఇక 2009 రంజీల్లో 800 రన్స్, దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ కొట్టినా తనకు భారత జట్టులో చోటు దక్కలేదని పార్థీవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు చాలా బాధపడినట్లు చెప్పిన పార్దీవ్.. కొత్త టీమ్‌ను బిల్డ్ చేస్తున్నారని సరిపెట్టుకున్నానన్నాడు. ఇక బ్యాటింగ్ స్కిల్స్ ఆధారంగానే టీమిండియా వికెట్ కీపర్ ఎంపిక జరగాలని, తన వరకైతే టెస్ట్‌ల్లో సాహా బెస్ట్ అన్నాడు. ఫార్మాట్ మారే కొద్ది స్కిల్స్ కూడా మారుతాయన్నాడు. కీపింగ్, బ్యాటింగ్ సమాన స్థాయిలో ఉన్న ఆటగాళ్లకు భారత్‌కు ఆడాలని, కుర్రాళ్లు సీనయర్ ప్లేయర్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలన్నాడు.

ఆ ఇద్దరే తీర్చిదిద్దారు..
తన 18 ఏళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పార్దీవ్.. గంగూలీ, కుంబ్లేలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ‘నిజమైన నాయకుడంటే సౌరవ్ గంగూలీ. అతని మేనేజ్‌మెంట్ స్కిల్ అద్భుతం. కుంబ్లే కూడా గ్రేట్ లీడర్. ఈ ఇద్దరే నన్ను తీర్చి దిద్దారు. నా ఫస్ట్ టెస్ట్ క్యాప్‌పై పేరు తప్పుగా పడింది. అది ఇంకా నా మదిలో అలాగే నిలిచిపోయింది. ఆ క్యాప్‌నే దాదా చేతుల మీదుగా అందుకున్నా. హెడింగ్లీ(2002), అడిలైడ్ (2003-04)లో విక్టరీలు, రావల్పిండిలో ఓపెనర్‌గా హాఫ్ సెంచరీ నా ఫెవరేట్ మెమొరీస్.'అని పార్ధీవ్ తెలిపాడు.

భిన్నాభిప్రాయాలు..
ఈ సీజన్ ఐపీఎల్ 2020 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలవడంతో టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గౌతం గంభీర్, మైఖేల్ వాన్, పార్ధీవ్ వంటి క్రికెటర్లు రోహిత్‌ను కెప్టెన్సీ చేయడం భారత జట్టుకు మంచిదంటున్నారు. అయితే వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్, ఆకాష్ చోప్రాలు మాత్రం ఆ అవసరం ఏం లేదని, దాని వల్ల అనవసర సమస్యలు వస్తాయని విరాట్‌కు మద్దతుగా నిలిచారు.
ముంబై ఇండియన్స్ బలంగా ఉండటం వల్లనే విజయం సాధించిందని, అంతేకాని రోహిత్ ఒక్కడి వల్ల సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలి రెండు వన్డేల్లో ఓడగానే మళ్లీ ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. కానీ ఆ తర్వాత టీ20 సిరీస్ నెగ్గడంతో విరాట్ విమర్శకులు మళ్లీ వెనక్కి తగ్గారు.


Click it and Unblock the Notifications












