
న్యూఢిల్లీ: టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీని వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇవ్వాలని డిమాండ్ వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ పార్ధీవ్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే బెటరని చెప్పాడు. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో పాల్గొన్న పార్థీవ్ పటేల్.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సారథ్యంపై జరిగిన చర్చలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
'ఎవరైతే సరైన నిర్ణయాలు తీసుకుంటారో.. ఆటను బాగా అర్థం చేసుకుంటారో.. క్లిష్ట స్థితిలో ఒత్తిడిని పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటారో ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే కోహ్లీ కన్నా రోహిత్ శర్మ కొంచెం బెటర్.'అని తెలిపాడు. అయితే ఆర్‌సీబీ ఆటగాడైన పార్ధీవ్ తమ కెప్టెన్ విరాట్ కోహ్లీని తక్కువ చేసి మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో పూర్తిగా బెంచ్‌కే పరిమితమైన పార్దీవ్ పటేల్.. కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతని స్థానంలో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ సూపర్ పెర్ఫామెన్స్ ఇవ్వడంతో ఈ సీనియర్ వికెట్ కీపర్ బెంచ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
ఇక ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ వరకు వెళ్లిన ఆర్‌సీబీ మళ్లీ ఉత్తి చేతులతోనే ఇంటికి వచ్చింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడి ఇంటిదారి పట్టింది. మరోవైపు ముంబై ఇండియన్స్ వరుసగా రెండోసారి టైటిల్ గెలుచుకొని ఐదో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. దాంతో రోహిత్ శర్మ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖెల్ వాన్, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌లు వెంటనే భారత జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వాలన్నారు. గంభీర్ అయితే ఈ నిర్ణయం తీసుకోకపోతే దేశానికే నష్టమని వ్యాఖ్యానించాడు. అయితే సెహ్వాగ్, ఆకాశ్ చోప్రాలు ఈ వ్యాఖ్యలను తప్పపట్టారు. రోహిత్ ఇతర జట్లతో టైటిల్ గెలుస్తాడా? అని చోప్రా ప్రశ్నించగా.. విరాట్ కోహ్లీ భారత జట్టును గెలిపించాడు కదా? అని నిలదీశాడు.