కొలంబో: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీతో జట్టు బలం పెరిగిందని బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నాడు. వచ్చే నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నలుగురు ఫాస్ట్ బౌలర్లు పూర్తి ఫిట్‌నెస్‌తో అందుబాటులో ఉన్నారని తెలిపాడు. ఆసియాకప్ 2023లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరగనున్న సూపర్ 4 మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పరాస్ మాంబ్రే.. బౌలింగ్ విభాగం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
'జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీతో టీమిండియా బౌలింగ్ బలం పెరిగింది. ఎన్‌సీఏ నుంచి బుమ్రా పురోగతిని నిశితంగా పరిశీలిస్తున్నాం. అతను జట్టులోకి వచ్చి సత్తా చాటడం సంతోషంగా ఉంది. బుమ్రా రాకతో మాకు నలుగురు నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇలాంటి బౌలింగ్ ఆప్షన్స్ ఉండటం జట్టుకు మంచిది.

జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలకు ఎక్కువ అవకాశాలిచ్చి షమీని పక్కన పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ విమర్శల్లో పసలేదు. మహమ్మద్ షమీ ఎంతో అనుభవజ్ఞుడు. దేశం కోసం ఎన్నోసార్లు అసాధారణ ప్రదర్శన చేశాడు. మహమ్మద్ షమీ లాంటి ఆటగాడిని పక్కనపెట్టడం అంత సులువు కాదు.
మేం ఆటగాళ్లతో మాట్లాడాం. వారు మాపై విశ్వాసం ఉంచారు. మేం ఏ నిర్ణయం తీసుకున్నా అది జట్టుకు ప్రయోజనం కోసమే అని ఆటగాళ్లకు బాగా తెలుసు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలర్‌గా రాణించడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నా. దీని కోసం మేం చాలా కాలం కృషి చేశాం. అతని వర్క్‌లోడ్‌ను మేనేజ్ చేస్తున్నాం.

హార్దిక్ పాండ్యా ఫిట్‌గా ఉన్నాడని, ఆశించిన మేరకు రాణిస్తాడని నిర్ధారించుకున్నాం. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. భిన్నమైన బౌలర్. అతను మాకు వికెట్ టేకింగ్ బౌలర్.'అని పరాస్ మాంబ్రే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆసియా కప్‌లో ఆడుతున్న హార్దిక్ పాండ్యా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. కీలకమైన సమయాల్లో వికెట్లు పడగొడుతున్నాడు.
వరుస విజయాలతో దుమ్మురేపిన టీమిండియా.. ఇప్పటికే ఆసియా కప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. వెన్నుగాయంతో బాధపడిన బుమ్రా ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్‌లో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో బుమ్రా కీలకం కానున్నాడు.