
కరాచీ: పాపం పాకిస్థాన్.. చాలా రోజుల తర్వాత సొంతగడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం కాగా.. వాటిని కూడా కరోనా మహమ్మారి అడ్డుకుంది. భద్రతా కారణాలు చూపుతూ.. సరిగ్గా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఆఖరి క్షణంలో న్యూజిలాండ్ తప్పుకోగా.. ఇంగ్లండ్ సైతం కివీస్ బాటలోనే నడిచింది. తాము పాక్‌లో పర్యటించలేమని చెప్పింది. దాంతో వెస్టిండీస్‌ను బుజ్జగించిన పీసీబీ.. ఎట్టకేలకు ఆ జట్టును ఒప్పించి సొంతగడ్డపై క్రికెట్‌ను రీస్టార్ట్ చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కూడా దిగ్విజయంగా ముగిసింది. కానీ పర్యాటక వెస్టిండీస్ జట్టులో కరోనా విలయతాండవం చేస్తుండటంతో వన్డే సిరీస్‌ను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వచ్చే ఏడాది జూన్‌లో ఈ సిరీస్‌ను నిర్వహిస్తామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తెలిపింది. ఇప్పటికే ముగ్గురికి కరోనా సోక గా, తాజాగా నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో విండీస్ బృందం లో మరో ముగ్గురు ఆటగాళ్లసహా ఐదుగురికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. షాయ్ హోప్, అకిల హుస్సేన్, జస్టిన్ గ్రీవ్స్‌తోపాటు సహాయ సిబ్బంది ఎస్ట్‌విక్, ఫిజీషియన్ అక్షయ్ మాన్‌సింగ్ వైరస్ బారినపడ్డట్టు పీసీబీ పేర్కొంది. మొత్తం ఆరుగురు కరీబియన్ ప్లేయర్లకు కరోనా సోకడంతో గురువారం జరగాల్సిన ఆఖరి, మూడో టీ20పై కొంత సందిగ్ధత నెలకొన్నా.. అందరినీ పరీక్షించిన తర్వాత ఆడేవిధంగా విండీ స్ బోర్డును పీసీబీ ఒప్పించగలిగింది. ఆటగాళ్ల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వన్డే సిరీస్‌ను వాయిదా వేయాలని ఇరు బోర్డులు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి.
వెస్టిండీస్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం చివరిదైన మూడో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రిజ్వాన్ (87), బాబర్ ఆజమ్ (79) చెలరేగగా.. మరోవైపు ఈ ఫార్మాట్‌లో తమ అత్యధిక ఛేదన (208)తో పాక్ రికార్డు నెలకొల్పింది. అలాగే ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో ఎక్కువ పరుగులు (2036) చేసిన బ్యాటర్‌గా రిజ్వాన్ చరిత్ర సృష్టించాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 207 పరుగులు చేసింది. పూరన్ (64), బ్రూక్స్ (49), కింగ్ (43) రాణించారు. ఆ తర్వాత పాక్ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 208 పరుగులు చేసి గెలిచింది.