ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్, శ్రీలంక జట్లు కీలక పోరుకు సిద్దమయ్యాయి. అబుదాబి వేదికగా నేడు(మంగళవారం) జరగనున్న సూపర్-4 మ్యాచ్‌లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సూపర్ -4లో భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్‌కు.. బంగ్లాదేశ్ చేతిలో ఖంగుతిన్న శ్రీలంకకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. ఇరు జట్లకు ఇది చావోరేవో మ్యాచ్. గెలిస్తే ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాలి.
ఈ క్రమంలోనే ఇరు జట్లు విజయమే లక్ష్యంగా సిద్దమవుతున్నాయి. పాకిస్థాన్‌పై గెలుపుతో సూపర్ 4 పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. శ్రీలంకపై గెలిచిన బంగ్లాదేశ్ రెండో స్థానంలో ఉంది. శ్రీలంక, పాక్ మూడు నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సూపర్-4 దశ ముగిసే సరికి టాప్-2లో నిలిచిన జట్లు ఆదివారం జరిగే ఫైనల్లో తలపడుతాయి. ఇప్పటికే నాలుగు జట్లు చెరో మ్యాచ్ ఆడాయి. మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.

పాక్‌పై గెలిచిన భారత్ తదుపరి మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడనుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఈ రెండు జట్లను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేం కాదు. మెరుగైన రన్‌రేట్‌తో ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ ఫైనల్‌కు చేరుకుంటుంది.
మరోవైపు భారత్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న పాకిస్థాన్‌కు మాత్రం ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ జట్టు శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్‌లను ఓడించడమే కాకుండా మెరుగైన రన్ రేట్ సాధించాలి. అప్పుడే ఫైనల్ బెర్త్ దక్కుతుంది. అయితే లీగ్ దశలో శ్రీలంక మూడు మ్యాచ్‌లకు మూడు గెలిచి సూపర్-4కు అర్హత సాధించింది. కానీ బంగ్లాదేశ్‌తో సూపర్ -4లో ఓటమిపాలైంది.
ఆ జట్టు నిర్దేశించిన లక్ష్యం సరిపోలేదు. మరోవైపు పాకిస్థాన్ ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. రెండు సార్లు భారత్ చేతిలోనే ఆ జట్టు ఓడింది. పాక్-శ్రీలంక సూపర్-4 మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఉన్నాయి. ముందుగా బౌలింగ్ చేసిన జట్టుకే గెలుపు ఛాన్స్ ఉంటాయి. ఫామ్ ప్రకారం పాకిస్థాన్ కంటే శ్రీలంక జట్టే మెరుగ్గా కనిపిస్తోంది. అంతేకాకుండా ఆసియా కప్ ముఖా ముఖి పోరులో పాక్‌పై శ్రీలంకదే పై చేయిగా ఉంది.