ఆసియా కప్ 2025 టోర్నీలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు కీలక పోరుకు సిద్దమయ్యాయి. నేడు(గురువారం) జరిగే సూపర్-4 మ్యాచ్ ఇరు జట్లకు నాకౌట్ పోరులాంటిది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించనుంది. శ్రీలంకపై గెలిచి సూపర్-4లో శుభారంభం చేసిన బంగ్లాదేశ్.. బుధవారం భారత్ చేతిలో 41 పరుగుల తేడాతో చిత్తయ్యింది.
బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్.. సూపర్-4 టేబుల్ టాపర్‌గా ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. మరోవైపు భారత్ చేతిలో ఓడి.. శ్రీలంకపై గెలిచిన పాకిస్థాన్ మెరుగైన రన్‌రేట్‌తో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. బంగ్లాదేశ్ మూడో స్థానంలో ఉంది. రెండు మ్యాచ్‌లకు రెండు ఓడిన శ్రీలంక నాలుగో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.

దాంతో రెండో ఫైనల్ బెర్త్ కోసం పాకిస్థాన్, బంగ్లాదేశ్ పోటీ పడుతున్నాయి. బలబలాల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి ఫైనల్ బెర్త్ దక్కించుకుంటే ముచ్చటగా మూడోసారి భారత్‌తో తలపడుతోంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. శ్రీలంకపై సాధించిన విజయంతో పాకిస్థాన్ జట్టు ఉత్సాహంగా ఉంది. ముఖ్యంగా ఆ జట్టు ప్రధాన పేసర్ షాహీన్ షా అఫ్రిది ఫామ్‌లోకి వచ్చాడు. స్పిన్నర్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. బ్యాటింగ్ విభాగం మెరుగైతే ఆ జట్టుకు తిరుగుండదు.
మరోవైపు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్న బంగ్లాదేశ్.. బ్యాటింగ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతోంది. ఆ జట్టు కెప్టెన్ లిటన్ దాస్ గాయంతో దూరమవడం కూడా ప్రతికూలంగా మారింది. భారత్‌తో మ్యాచ్ ముగిసిన మరుసటి రోజే పాక్‌తో ఆడాల్సి రావడం బంగ్లాదేశ్‌కు ప్రతికూలంగా మారనుంది. ఏ మాత్రం విశ్రాంతి లేకుండా బంగ్లాదేశ్ బరిలోకి దిగనుంది.
బంగ్లాదేశ్ :
సైఫ్ హసన్, తంజిద్ హసన్ తమీమ్, పర్వేజ్ హుస్సేన్ ఎమోన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హుస్సేన్, జకేర్ అలీ (వికెట్ కీపర్/కెప్టెన్), మహ్మద్ సైఫుద్దీన్, రిషద్ హుస్సేన్, తంజిమ్ హసన్ సాకిబ్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, లిట్టన్ దాస్, మెహదీ హసన్, టాస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్.
పాకిస్తాన్ :
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారిస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్, సల్మాన్ మీర్జా, సుఫియాన్ ముఖీమ్, ఖుష్దిల్ షా, హసన్ నవాజ్.