
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఇంట త్వరలోనే పెళ్లి బాజా మోగనున్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా మామ కూతురితో ప్రేమాయణం నడుపుతున్న ఈ వరల్డ్ నెంబర్ బ్యాట్స్‌మెన్.. వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇరు కుటుంబాల మధ్య మాటలు పూర్తయ్యాయని, పెద్దలు పరస్పర అంగీకారానికి వచ్చారని నిశ్చితార్థం కూడా జరిగిందని, వచ్చే ఏడాది ఆరంభంలో పెళ్లి జరగనుందని బాబర్ సన్నిహితులు తెలిపారని జియో టీవీ పేర్కొంది. కాగా, బాబర్ పెళ్లి విషయమై సహచర ఆటగాడు, పాక్ మాజీ కెప్టెన్ అజహర్ అలీ ఇటీవలే కొన్ని వ్యాఖ్యలు చేశాడు.
కెప్టెన్‌కు మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా అని ట్విటర్ వేదికగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతను స్పందిస్తూ.. త్వరగా పెళ్లి చేసుకోవాలని సూచించాడు. అయితే యాదృచ్చికంగా అజహర్ అలీ వ్యాఖ్యలు చేసిన తర్వాతి రోజే పాక్ కెప్టెన్ పెళ్లి విషయమై వార్తలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే, గత కొద్ది కాలంగా కెరీర్ అత్యుత్తమ ఫామ్‌లో కొనసాగుతున్న పాక్ కెప్టెన్.. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని వెనక్కు నెట్టి వన్డేల్లో వరల్డ్ నెంబర్ 1 ర్యాంకును అందుకున్నాడు.
అంతేకాకుండా సౌతాఫ్రికా పర్యటనలో దుమ్మురేపిన బాబర్.. ఏప్రిల్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇటీవలే జింబాబ్వే పర్యటనను ముగంచుకుని స్వదేశానికి చేరుకున్న బాబర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్) సెకండాఫ్ మ్యాచ్‌లకు సిద్దమవుతున్నాడు. పీఎస్‌ఎల్‌లో అతను కరాచీ కింగ్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే.