అండర్ 19 ఆసియా కప్ 2025లో విజేతగా నిలిచిన పాకిస్థాన్ కుర్రాళ్లపై ఆ దేశ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ కనక వర్షం కురిపించారు. విజేతగా నిలిచిన పాకిస్థాన్ అండర్ 19 టీమ్ కుర్రాళ్లకు ఒక్కొక్కరికి కోటి పాకిస్థాన్ రూపాయాలను నజరానాగా ప్రకటించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ అండర్ 19 టీమ్ మెంటార్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మీడియాకు తెలియజేశాడు.
సోమవారం ఇస్లామాబాద్‌లో ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌ను పాకిస్థాన్ అండర్ 19 టీమ్ కలిసింది. ఈ సందర్భంగా కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురిపించిన పాక్ ప్రధాని.. ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ ఘనంగా సత్కరించారు. కుర్రాళ్ల విజయానికి ఫిదా అయిన ప్రధాని ఒక్కొక్కరికి కోటి రూపాయల నజరానాను ప్రకటించారని సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు.
'ప్రధాని కుర్రాళ్లకు నగదు బహుమతిని ప్రకటించారు. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. వీరికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది" అని సర్ఫరాజ్ పేర్కొన్నారు. భారత కరెన్సీ ప్రకారం ఒక్కో ఆటగాడికి రూ.32 లక్షల క్యాష్ రివార్డ్ లభించనుంది.

ఈ గెలుపు వెనుక ఆరు నెలల కష్టం ఉందని, రాత్రికి రాత్రే ఈ విజయం దక్కలేదని పాకిస్థాన్ అండర్ 19 టీమ్ హెడ్ కోచ్ షాహిద్ అన్వర్ అన్నాడు. 'గత జూన్ నెలలోనే 70 మంది ఆటగాళ్లతో ట్రయల్స్ ప్రారంభించాం. వారిలో నుంచి 20 మందిని ఎంపిక చేసి, వారికి దేశీయ స్థాయిలో 50 ఓవర్ల క్రికెట్ ఆడే అవకాశం కల్పించాం. ఆ సుదీర్ఘ సన్నాహక ఫలితమే నేటి ఈ విజయం'అని చెప్పుకొచ్చాడు.
ఆదివారం జరిగిన అండర్ 19 ఆసియాకప్ 2025 ఫైనల్లో పాకిస్థాన్ అండర్ 19 టీమ్ 191 పరుగుల భారీ తేడాతో భారత్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ అండర్ 19 టీమ్ నిర్ణీ 50 ఓవర్లలో 8 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోర్ చేసింది. సమీర్ మిన్హాస్(113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లతో 172) భారీ శతకంతో రాణించాడు.
అనంతరం భారత్ అండర్ 19 టీమ్ 26.2 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. అలీ రాజా(4/42) నాలుగు వికెట్లు తీయగా.. మహమ్మద్ సయ్యమ్(2/38), అబ్దుల్ సుభమ్(2/29), హుజైఫా అషాన్(2/12) రెండు వికెట్లు పడగొట్టాడు.