అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో జోరు మీద ఉన్న పాకిస్థాన్ అసలు సిసలు సమరానికి సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా శనివారం భారత్ జరిగే హై ఓల్టేజ్ మ్యాచ్‌లోపాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురు చూస్తోంది.
వరల్డ్ బిగ్టెస్ట్ క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఆతిథ్య బీసీసీఐ మ్యాచ్‌కు ముందు ఆరంభ వేడుకలను ఏర్పాటు చేసింది. లక్షా 30 వేల మంది ప్రేక్షకుల మధ్య జరిగే ఈ బిగ్గెస్ట్ క్రికెట్ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్దమయ్యాయి. విజయం కోసం తమ వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి.

వన్డే ప్రపంచకప్ చరిత్రలో పాకిస్థాన్‌పై ఓటమెరుగని జట్టుగా భారత్‌కు రికార్డు ఉంది. ఇప్పటి వరకు వన్డే ప్రపంచకప్‌ల్లో ఇరు జట్లు ఏడు సార్లు తలపడగా.. ఏడింటిలోనూ భారతే గెలిచింది. ఈ లెక్కను సరిచేసేందుకు పాకిస్థాన్ సిద్దమైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, టీ20 ప్రపంచకప్ 2021 లీగ్ మ్యాచ్‌లో ఓడించినట్లు ఈసారి భారత్‌ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేసింది.
యువ పేసర్ నసీమ్ షా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద లోటు కాగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా బలహీనతే. భారత్‌తో విజయం సాధించేందుకు పాకిస్తాన్ టీమ్ కాంబినేషన్‌లో స్పల్ప మార్పులు చేయనుంది. హసన్ అలీ స్థానంలో మహమ్మద్ వసీంతో బరిలోకి దిగనుంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హసన్ అలీ నాలుగు వికెట్లు తీసినా ధారళంగా పరుగులివ్వడంతో అతన్ని పక్కనపెట్టి మహమ్మద్ వసీం ఆడించాలనుకుంటోంది.
అయితే ఈ మ్యాచ్‌కు బ్లాక్ సాయిల్ పిచ్ రెడీ చేసి నేపథ్యంలో బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే మాత్రమే హసన్ అలీనే కొనసాగించనుంది. ఓపెనర్లుగా అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ ఆడనుండగా.. ఫకార్ జమాన్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనుండగా.. ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ లోయరార్డర్ బాధ్యతలు తీసుకోనున్నారు.
షాహిన్ అఫ్రిది, హ్యారీ రౌఫ్, మహమ్మద్ వసీంలు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పాకిస్తాన్ తుది జట్టు(అంచనా): అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తికర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్, షాహిన్ అఫ్రిది, హసన్ అలీ/మహమ్మద్ వసీం, హ్యారీస్ రౌఫ్