
కరాచీ: పాకిస్థాన్ స్టార్ పేసర్ వహాబ్ రియాజ్ రోడ్డుపై బఠానీలు అమ్ముకుంటున్నాడు. 2011, 2015 వన్డే ప్రపంచకప్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన వహాబ్.. గత రెండేళ్లుగా పాక్ జట్టుకు దూరమయ్యాడు. 2011 ప్రపంచకప్‌లో భాగంగా మోహాలీ వేదికగా భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వహాబ్ (5/46) ఐదు వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, జహీర్‌ఖాన్‌లను ఔట్ చేశాడు. అలాంటి స్టార్ పేసర్.. సోమవారం పాకిస్థాన్ రోడ్డుపై వీధి వ్యాపారిలా బఠానీలు అమ్ముతూ కనిపించాడు.
పైగా దానికి సంబంధించిన వీడియోను అతనే ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఈ పని తాను సరదాగా చేశాడు. 'మీ చానోవాలా చాచా.. ఇప్పుడే ఆర్డరివ్వండి. ఇలా బఠానీలు అమ్మడం నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది'అని క్యాప్షన్‌గా రాసుకొచ్చాడు.
పల్లీలు, బఠానీలు అమ్ముకుంటూ వహాబ్ రియాజ్ ఈ వీడియోలో కనిపించాడు. రోడ్డు పక్కన ఉన్న పల్లీల వ్యాపారి వద్దకు వెళ్లిన వహాబ్ రియాజ్... అతనిలాగే.. వాటిని అమ్మడం మొదలు పెట్టాడు. అంతేకాదు.. ఓ కస్టమర్ కు పల్లీలు కూడా అమ్మాడు.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అతని పనిని మెచ్చుకుంటే మరికొందరు అతని పరిస్థితి ఇంతగా దిగజారిందా?అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. గత రెండేళ్లుగా వహాబ్.. పాక్ జట్టుకు దూరమయ్యాడు. ఇక ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్‌కు మెగా టోర్నీల్లో మంచి రికార్డు ఉంది. 2011 ప్రపంచ కప్‌లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో వహాబ్ 8 వికెట్లు పడగొట్టాడు.
వహాబ్ రియాజ్ 2015 ప్రపంచకప్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. 2015 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున వహాబ్ 16 వికెట్లు పడగొట్టాడు. వహాబ్ డిసెంబర్ 2020 నుంచి పాక్ జట్టుకు దూరమయ్యాడు. 36 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ 27 టెస్టుల్లో 83 వికెట్లు తీశాడు. 91 వన్డేల్లో 120 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, ఈ ఫాస్ట్ బౌలర్ 36 టీ20ల్లో 34 వికెట్లు తీశాడు.