అభిమానితో గొడవపై పాకిస్థాన్ స్టార్ పేసర్ హ్యారిస్ రౌఫ్ స్పందించాడు. తన కుటుంబం జోలికి వస్తే ఇలానే ఉరికించి కొడుతానని హెచ్చరించాడు. టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ జట్టు దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
పసికూన అమెరికాతో పాటు చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిన పాకిస్థాన్.. కెనడా, ఐర్లాండ్‌పై విజయం సాధించినా టోర్నీలో ముందడుగు వేయలేకపోయింది. ఈ దారుణ వైఫల్యంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆటగాళ్ల మధ్య ఉన్న విభేదాలు జట్టు కొంపముంచాయని విమర్శించారు.

అభిమానిపై చేయి చేసుకున్న హ్యారిస్ రౌఫ్..
ఈ క్రమంలోనే సతీమణితో కలిసి అమెరికా వీధుల్లో నడుస్తున్న హ్యారిస్ రౌఫ్‌ను ఓ అభిమాని ట్రోల్ చేశాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హ్యారిస్ రౌఫ్.. సదరు అభిమాని భారత్‌కు చెందినవాడని భావించి కొట్టేందుకు వెళ్లాడు. అతని సతీమణి గొడవ వద్దని వారించినా.. కోపాన్ని నియంత్రించుకోలేక సంయమనం కోల్పోయాడు.
ఈ వ్యవహారాన్ని అక్కడున్న ఇతరులు తమ మొబైల్‌లో వీడియో తీసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.
సదరు అభిమాని భారత్‌కు చెందినవాడని భావించి హ్యారీస్ రౌఫ్ అతనితో గొడవకు దిగినట్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. అయితే సదరు అభిమాని తాను పాకిస్థాన్ వాడినని చెప్పడం వీడియోలో కనిపించింది.
నా కుటుంబం జోలికి వస్తే..
హ్యారీస్ రౌఫ్ సతీమణితో పాటు ఇతర అభిమానులు అతన్ని ఆపిటన్లు వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ గొడవ తీవ్ర చర్చనీయాంశం కావడంతో సోషల్ మీడియా వేదికగా హ్యారిస్ రౌఫ్ స్పందించాడు. తనను ఎంత ట్రోల్ చేసినా భర్తిస్తానని, కుటుంబం జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టనని హెచ్చరించాడు.
'ఈ గొడవను సోషల్ మీడియాలోకి తీసుకు రావద్దని అనుకున్నా. కానీ వీడియో బయటకు వచ్చింది. కాబట్టి ఈ విషయం మాట్లాడక తప్పడం లేదు. పబ్లిక్ ఫిగర్లుగా ఉన్న కారణంగా జనాల నుంచి మేం అన్ని రకాల ఫీడ్ బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు వాళ్లే మమ్మల్ని సమర్థిస్తారు. మరికొన్ని సార్లు విమర్శిస్తారు.
కానీ నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంత వరకే నేను వాటన్నింటినీ భరిస్తాను. ఒకవేళ ఈ విషయంలో వాళ్లు హద్దు దాటితే నేను కూడా వారికి తగ్గట్లుగా రియాక్ట్ అవుతాను. ఫ్రోఫెషన్లకు అతీతంగా ప్రతీ ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది.'అని హ్యారిస్ రౌఫ్ ఎక్స్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు.