pakistan: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ ఆడకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని ఇప్పటికే ఐసీసీ హెచ్చరించింది. భారీ జరిమానాతో పాటు ఆంక్షలు విధిస్తామని పరోక్షంగా మందలించింది.
అయితే ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఒక కొత్త చట్టపరమైన ఎత్తుగడకు సిద్దమైంది. ఫోర్స్ ముజూర్ అనే నిబంధనను ఉపయోగించుకొని ఆంక్షలు తప్పించుకోవాలని పాకిస్థాన్ ప్రణాళికలు రచిస్తోంది.
సాధారణంగా ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒక దేశం కావాలని మ్యాచ్ ఆడకపోతే భారీ జరిమానాలు, నిధుల నిలిపివేత వంటి కఠిన చర్యలు ఉంటాయి. అయితే, వీటి నుంచి తప్పించుకోవడానికి పీసీబీ 'ఫోర్స్ మజూర్' అనే నిబంధనను తెరపైకి తెస్తోంది. ఊహించని, తమ నియంత్రణలో లేని అసాధారణ పరిస్థితులు.. ఉదాహరణకు ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వ నిషేధాలు ఎదురైనప్పుడు ఫోర్స్ మజూర్ ద్వారా ఒప్పంద బాధ్యతల నుంచి మినహాయింపు కోరవచ్చు.
'మేం ఆడటానికి సిద్ధంగా ఉన్నా.. మా ప్రభుత్వం అనుమతించడం లేదు. ఇది మా చేతుల్లో లేని అంశం.’అని ఐసీసీకి చెప్పడం ద్వారా శిక్షలు, ఆంక్షల నుంచి తప్పించుకోవచ్చని పాక్ భావిస్తోంది.

పాకిస్థాన్ వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు బీసీసీఐ సిద్దమవుతోంది. పాకిస్థాన్ చేస్తున్న ఈ వాదనలో పసలేదని భారత క్రికెట్ బోర్డు గట్టిగా వాదిస్తోంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందిస్తూ పాక్ ద్వంద్వ వైఖరిని ఎత్తిచూపారు.
'టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో ఆడకూడదని పాక్ ప్రభుత్వం నిర్ణయించిన రోజునే.. పాక్ అండర్-19 జట్టు భారత్‌తో మ్యాచ్ ఆడింది. ప్రభుత్వానికి నిజంగానే విధానపరమైన అభ్యంతరాలు ఉంటే.. ఆ మ్యాచ్ కూడా ఆడకుండా ఉండాలి కదా? ఒకచోట ఆడి, మరోచోట ఆడననడం కేవలం సాకులు చెప్పడమే.’అని ఓ బీసీసీఐ అధికారి మీడియాతో అన్నాడు.
బీసీసీఐ తన వాదనలో మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ప్రస్తుతం పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రిగా కూడా ఉన్నారు. అలాగే పాక్ ప్రధాని బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
'నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు ప్రభుత్వంలో.. బోర్డులోనూ ఒక్కరే అయినప్పుడు.. ప్రభుత్వం అడ్డుకుంటోంది అనడం హాస్యాస్పదం’అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇస్లామాబాద్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15 మ్యాచ్‌లో భారత్‌తో తలపడకూడదనే నిర్ణయంపై వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.