ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కొత్త డ్రామాకు తెరలేపింది. భద్రతా కారణాలు చూపుతూ భారత్‌లో పర్యటించలేమని ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోగా.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన పాకిస్థాన్.. అన్యాయమని, ఏకపక్ష నిర్ణయమని ఐసీసీపై మండిపడింది. తాము కూడా టీ20 ప్రపంచకప్ ఆడేది లేనిది తమ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉందని పీసీబీ చీఫ్ మోహ్‌సిన్ నఖ్వీ చెప్పడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న ఐసీసీ.. పీసీబీకి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు కూడా వార్తలు వచ్చాయి. దాంతో వెనక్కి తగ్గిన పాకిస్థాన్.. ఆలస్యంగా టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగే జట్టును ప్రకటించింది. ఐసీసీ సమావేశంలో బంగ్లాదేశ్‌కు అనుకూలంగా ఓటేసిన ఏకైక సభ్య దేశం కూడా పాకిస్థాన్ కావడం గమనార్హం. జట్టు ప్రకటనతో పాకిస్థాన్ బరిలోకి దిగడం లాంఛనమేనని భావిస్తున్న క్రమంలో.. మోహ్‌సిన్ నఖ్వీ సోషల్ మీడియా వేదికగా బాంబు పేల్చాడు.

తమ దేశప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌తో సమావేశమయ్యానని, ప్రస్తుత పరిస్థితుల గురించి వివరించానని, తుది నిర్ణయం జనవరి 30 లేదా ఫిబ్రవరి 2న వెల్లడిస్తామని మోహ్‌సిన్ నఖ్వీ ట్వీట్ చేశాడు. 'మా ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్‌తో సమావేశం జరిగింది. ఐసీసీలో చోటు చేసుకున్న పరిణామాలన్నింటిని ఆయనకు కులంకషంగా వివరించాను.
పాక్‌కు ఉన్న అన్నీ ఆప్షన్స్‌ను పరిగణలోకి తీసుకోని పరిష్కారం కనుగొనాలని ఆదేశించారు. మెగా టోర్నీలో పాల్గొనే విషయంపై తుది నిర్ణయం శుక్రవారం లేదా వచ్చే సోమవారం వెల్లడిద్దామని చెప్పారు.'అని నఖ్వీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రముఖ క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్.. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే యోచనలో పాకిస్థాన్ ఉన్నట్లు తెలిపింది. ఈ టోర్నీలో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. టోర్నీలో పాల్గొని భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని, తద్వారా ఆతిథ్య దేశానికి తమ నిరసనను తెలియజేయాలని పీసీబీ భావిస్తుందని పేర్కొంది.
ఒకవేళ భారత్‌తో మ్యాచ్ రద్దు చేసుకుంటే పాకిస్థాన్ ఆ మ్యాచ్ పాయింట్స్ కోల్పోనుంది. ఆ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలుస్తుంది. కానీ పాక్ నిర్ణయాన్ని ఐసీసీ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికైన శ్రీలంకలో జరగనున్నాయి. అక్కడ ఆడేందుకు ఆ జట్టుకు వచ్చిన అభ్యంతరం ఏంటో వివరించాల్సి ఉంటుంది. రాజకీయ కారణాలు అని తేలితే రూల్స్ ప్రకారం పాకిస్థాన్‌పై ఐసీసీ నిషేధం విధించవచ్చు.