ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 నేపథ్యంలో ఐర్లాండ్‌తో పాకిస్థాన్ ఆడాల్సిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్ రద్దయ్యింది. వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండా ఈ మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయింది. బుధవారం కొలంబో వేదికగా జరగాల్సిన ఈ వామప్ గేమ్‌లో వర్షం కారణంగా టాస్ కూడా వేయలేదు. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఇరు జట్లు నిరాశగా వెనుదిరిగాయి.
అయితే ఈ మ్యాచ్ రద్దవ్వడంతో పాకిస్థాన్ జట్టులో ఆందోళన నెలకొంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నామని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహ్‌బాజ్ షరీఫ్ తాజాగా వెల్లడించాడు. దాంతో పాకిస్థాన్ సూపర్ -8 చేరాలంటే మిగిలిన మూడు లీగ్ మ్యాచ్‌లకు మూడు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఎందుకంటే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తే.. పాకిస్థాన్ రెండు పాయింట్స్ కోల్పోతుంది. భారత్, నమీబియా, నెదర్లాండ్స్, అమెరికాతో పాకిస్థాన్ గ్రూప్-ఏలో ఉంది. టాప్-2లో నిలిచి జట్లు సూపర్-8లో చేరుతాయి. భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే పాకిస్థాన్ తదుపరి మూడు మ్యాచ్‌లకు మూడు గెలవాలి. అయితే శ్రీలంకలో వర్షాలు కురుస్తుండటం పాకిస్థాన్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. పాకిస్థాన్ తమ ప్రపంచకప్ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలోనే ఆడనుంది. బీసీసీఐ, పీసీబీ చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇరు దేశాల తటస్థ వేదికగా తలపడుతున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఐర్లాండ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ రద్దవ్వడంతో పాకిస్థాన్‌కు భయం పట్టుకుంది. భారత్‌తో మ్యాచ్ బహిష్కరించిన నేపథ్యంలో ఒక్క మ్యాచ్ వర్షంతో తుడుచుకుపెట్టుకుపోయినా.. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు పాకిస్థాన్ ప్రధాని భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని తెగేసి చెబుతున్నా.. యూటర్న్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్, పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి అయిన మొహ్సిన్ నఖ్వీ, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే తన నిర్ణయంపై యూ-టర్న్ తీసుకునే అవకాశం ఉందని ప్రముఖ వార్త సంస్థ పీటీఐ పేర్కొంది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దె దించి, అక్కడ ఒక లౌకిక ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పాకిస్థాన్ భారత్‌తో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
'నఖ్వీ ఒక క్రికెట్ నిర్వాహకుడి కంటే ఎక్కువగా రాజకీయ నాయకుడు. అతనికి జాతీయ జట్టు సంక్షేమం గురించి ఏమాత్రం పట్టింపు లేదు. దీని ద్వారా ఆయన కేవలం రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఫిబ్రవరి 12న ఎన్నికలు ముగిసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఉంది.'అని పీటీఐ పేర్కొంది.