ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎంపికవ్వడం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు మింగుడు పడని వ్యవహారమని ఓ వైపు చర్చ జరుగుతుంటే.. మరోవైపు ఆ దేశ మాజీ
క్రికెటర్ రషీద్ లతీఫ్ మాత్రం కలిసొచ్చే అంశమని సంతోషం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణ విషయంలో పీసీబీకి జై షా అండగా ఉంటాడని అభిప్రాయపడ్డాడు. దాంతోనే జై షా ఎన్నికను పీసీబీ వ్యతిరేకించలేదని చెప్పుకొచ్చాడు.
బీసీసీఐ సెక్రటరీగా ఉన్న జై షా మంగళవారం ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. డిసెంబర్ 1 నుంచి ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇక ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికవ్వడంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు భయం గుప్పిట్లోకి వెళ్లిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విషయంలో జై షా సహకరిస్తాడా? లేదా? అనే ఆందోళన పీసీబీకి నెలకొందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీసీసీఐ సెక్రటరీగా టీమిండియాను పాకిస్థాన్‌కు పంపించేందుకు నిరాకరించిన జై షా.. ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ ఏం తిరకాసు పెడుతాడోనని పీసీబీ భయపడుతోందన్నారు.
రషీద్ లతీఫ్ మాత్రం జై షా ఎన్నికపై సానుకూలంగా స్పందించడం చర్చనీయాంశమైంది. తన యూట్యూబ్ చానెల్ వేదికగా జై షా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికవ్వడం గురించి మాట్లాడిన రషీద్ లతీఫ్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత్.. పాకిస్థాన్‌కు వచ్చేలా జై షా చొరవ చూపుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆ ఒప్పందంలో భాగంగానే పీసీబీ జై షా ఎన్నికను వ్యతిరేకించలేదని తెలిపాడు.
ఒకవేళ పాకిస్థాన్ పర్యటనకు భారత్ వస్తే అది జై షా ప్రయత్నమేనని భావించాలన్నాడు. 'ఐసీసీ ఛైర్మన్‌గా జై షా ఎన్నికను పీసీబీ వ్యతిరేకించలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు అండగా ఉంటాడనే అతనికి మద్దతు తెలిపింది. నాకు తెలిసి ఇది బీసీసీఐ, పీసీబీ మధ్య కుదిరిన ఒప్పందం అనుకుంటా. ఒకవేళ భారత జట్టు.. పాకిస్థాన్ పర్యటనకు వస్తే మాత్రం అది భారత ప్రభుత్వ మద్దతుతో పాటు జై షా ఎఫర్ట్‌గానే భావించాలి.
టీమిండియా పాకిస్థాన్‌కు రావడానికి కావాల్సిన భారత ప్రభుత్వ అనుమతులు ఇప్పటికే సగం పూర్తయ్యాయి. భారత జట్టు ఖచ్చితంగా పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.'అని రషీద్ లతీఫ్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
1996 వన్డే ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న తొలి ఐసీసీ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025నే కావడం విశేషం. ఇరు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో టీమిండియా.. గత 16 ఏళ్లుగా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. చివరిసారిగా 2008లో ఆసియాకప్ కోసం పాక్ పర్యటనకు భారత్ వెళ్లింది.
2013 నుంచి ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం కూడా భారత్.. పాకిస్థాన్‌కు వెళ్లదని, అక్కడ తమ ఆటగాళ్లకు భద్రత లభించదని బీసీసీఐ వాదిస్తోంది. తమ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది.