టీమిండియా కంటే ఎక్కువ తప్పిదాలు చేయడంతోనే రెండు మ్యాచ్‌ల్లో చిత్తయ్యామని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. ఫైనల్లో ఆ తప్పిదాలను సవరించుకుంటామని చెప్పాడు. ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, పాకిస్థాన్ తలపడనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టోర్నీలో దాయాదీ దేశాలు రెండు సార్లు తలపడగా.. టీమిండియానే గెలుపొందింది.
ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఫైనల్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ అఘా తమ పరాజయాలకు గల కారణాన్ని చెప్పాడు. అంతేకాకుండా వ్యక్తిగతంగా తన ప్రదర్శన కూడా స్థాయికి తగ్గట్లు లేదని అంగీకరించాడు.

'భారత్ కంటే ఎక్కువ తప్పిదాలు చేయడంతోనే మేం రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయాం. భారత్-పాక్ మ్యాచ్ అంటేనే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి లేదని చెప్పడం అబద్దం. ఎక్కువ తప్పిదాలు చేయడంతోనే భారత్‌పై విజయం సాధించలేకపోయాం. ఫైనల్లో తప్పులు చేయకుండా ఉంటే భారత్‌పై పాకిస్థాన్‌కు గెలిచే అవకాశం ఉంటుంది. ఇరు జట్లలో ఒత్తిడి అధిగమిస్తూ.. తక్కువ తప్పులు చేసే జట్టునే విజయం వరిస్తుంది. మేం తక్కువ తప్పులు చేసేలా చూసుకుంటాం.
నా వ్యక్తిగత ప్రదర్శన కూడా స్థాయికి తగ్గట్లు లేదు. నా బ్యాటింగ్‌పై నేను వర్క్ చేస్తున్నాను. అయితే ఇక్కడ పిచ్ కండిషన్స్, టీమ్ అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడూ 150 స్ట్రైక్‌రేట్‌తోనే ఆడుతామంటే కుదురదు. కొన్నిసార్లు పరిస్థితులు, పిచ్ కండిషన్స్ దూకుడుగా ఆడేందుకు సహకరించావు. కాబట్టి జట్టు అవసరాలకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది.
దూకుడు విషయంలో మా ఆటగాళ్లకు ఎలాంటి పరిమితులు, హద్దులు విధించలేదు. వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ప్రతి ఒక్కరికీ తమదైన శైలి ఉంటుంది. ఒక ఆటగాడు మైదానంలో దూకుడుగా ఉండాలనుకుంటే..వారి ఆపడం ఎందుకు? ఫాస్ట్ బౌలర్ ఆవేశాన్ని ఆపేస్తే.. వారికి ఇంకేం మిగులుతుంది. జట్టులో ప్రతీ ఆటగాడికి తమ భావోద్వేగాలను ఎలా నియంత్రించుకోవాలో బాగా తెలుసు.
ఓ కెప్టెన్‌గా.. నేను ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఇస్తాను. వారు ఎరిని అగౌరవపరచుకుండా? జట్టుకు దేశానికి చెడ్డ పేరు తీసుకురానంతవరకు వారు మైదానంలో ఎలాగైనా వ్యవహరించవచ్చు. హద్దులు ధాటనంత వరకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.'అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు. 41 ఏళ్ల ఆసియా కప్ చరిత్రలోనే తొలిసారి భారత్, పాకిస్థాన్ ఫైనల్లో తలపడుతున్నాయి. ఇరు దేశాల మధ్య జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు కవ్వింపులకు పాల్పడగా.. భారత ప్లేయర్లు సమర్థవంతంగా తిప్పికొట్టారు. దాంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.