ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ముందు పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అనుమతిచ్చిన ఇస్లామిక్ రిపబ్లిక్ పాకిస్థాన్ ప్రభుత్వం.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని ఆదేశించింది. దాంతో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ జరిగే అవకాశం లేకుండా పోయింది.
పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆ జట్టు టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ అఘా స్పందించాడు. ఇది తమ చేతుల్లో లేని విషయమని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో మూడు టీ20 గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడిన సల్మాన్ అలీ అఘా.. ప్రభుత్వం, పీసీబీ ఆదేశాలు పాటించడమే తమ కర్తవ్యమని స్పష్టం చేశాడు. 'మేం ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఆడబోతున్నాం. అయితే భారత్‌తో ఆడకూడదనేది మా నిర్ణయం కాదు. ఈ విషయంలో మేం ఏం చేయలేం. మా ప్రభుత్వం, పీసీబీ ఛైర్మన్ మాకు ఏది చెబితే అది మాత్రమే మేం చేస్తాం.'అని సల్మాన్ అఘా చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్ జట్టు ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఆడుతుందని, కానీ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను ఆడదని పాకిస్థాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. బంగ్లాదేశ్ జట్టుకు మద్దుతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో పర్యటించడం తమ ఆటగాళ్ల భద్రతకు శ్రేయాస్కారం కాదని భావించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది.
ఈ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చిన ఐసీసీ.. భారత్‌లో బంగ్లా ఆటగాళ్ల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని, మ్యాచ్ తరలించబోమని స్పష్టం చేసింది. దాంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. వారి స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసీసీ ఎంపిక చేసింది. ఈ చర్యను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) తప్పుబట్టింది. ఇది అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కూడా టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించింది. చివరకు భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని నిర్ణయం తీసుకుంది.
టీ20 ప్రపంచకప్ 2026లో ఒక జట్టుతో మాత్రమే ఆడమని చెప్పడం క్రీడా స్ఫూర్తికి విరుద్దమని ఐసీసీ పేర్కొంది. పాకిస్థాన్ నిర్ణయం వల్ల కలిగే పరిణామాల గురించి హెచ్చరించింది. ఐసీసీ రూల్స్ ప్రకారం పాకిస్థాన్ జట్టు మైదానంలోకి అడుగుపెట్టకపోతే వాకోవర్‌గా పరిగణిస్తారు. భారత్‌కు ఉచితంగా 2 పాయింట్ల లభిస్తాయి. టోర్నీ ప్రారంభం కాకముందే భారత్ ఖాతాలో రెండు పాయింట్స్ చేరినట్లే. ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్ నెట్ రన్‌రేట్ గణనీయంగా తగ్గుతుంది. ఇది వారి సెమీఫైనల్ అవకాశాలను దెబ్బతీయవచ్చు.
ఆస్ట్రేలియాపై 3-0తో సిరీస్ గెలిచి మంచి ఊపు మీద ఉన్న పాకిస్థాన్ జట్టుకు, ఈ రాజకీయ నిర్ణయం టోర్నీలో పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. పాకిస్థాన్ జట్టుపై ఐసీసీ కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.