ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను శుక్రవారం వెల్లడించింది. ఇప్పటికే ఈ టోర్నీలో పాల్గొనే మిగతా దేశాలు తమ జట్లను ప్రకటించగా.. ఆతిథ్య పాకిస్థాన్ మాత్రం ఆలస్యంగా జట్టును ప్రకటించింది. సౌతాఫ్రికా పర్యటనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టులో నాలుగు మార్పులు చేసింది.
ఓపెనర్ సయీమ్ ఆయుబ్ గాయంతో దూరమవ్వగా.. ఫామ్‌లో లేని అబ్దుల్లా షఫీక్, ముహమ్మద్ ఇర్ఫాన్, సుఫియాన్ ముఖీమ్‌లపై పాకిస్థాన్ సెలెక్టర్లు వేటు వేసారు. వారి స్థానాల్లో ఫహీమ్ అష్రఫ్, ఫకార్ జమాన్, ఖుషిదిల్ షా, సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ మెగా టోర్నీలోనూ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వానే పాకిస్థాన్ జట్టును నడిపించనున్నాడు. ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ అఘా అతనికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.

2017 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోని ముగ్గురు ప్లేయర్లు బాబార్ ఆజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫకార్ జమాన్ తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా అఫ్రిది పాక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. మహమ్మద్ హస్‌నైన్, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ అతనితో పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. అబ్రర్ అహ్మద్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కాగా.. ఆల్‌రౌండర్లు అఘా, కుష్‌దిల్ అతనికి అండగా ఉండనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగే ట్రై సిరీస్‌లోనూ పాకిస్థాన్ ఇదే జట్టుతో బరిలోకి దిగనుంది. ఈ ట్రై సిరీస్ ఫిబ్రవరి 8 నుంచి ప్రారంభం కానుంది. కరాచీ వేదికగా ఫిబ్రవరి 14న ఈ సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికగా ఈ టోర్నీ జరగనుండగా.. భారత్ మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌లో నిర్వహించనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టు:
మహమ్మద్ రిజ్వాన్(కెప్టెన్), బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్, టయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, కుష్‌దిల్ షా, సల్మాన్ అఘా(వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రర్ అహ్మద్, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ హస్‌నైన్, నసీమ్ షా, షాహిన్ షా అఫ్రిది.