పాకిస్థాన్ ఓపెనర్ షాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ పేరిట ఉన్న రికార్డును ఫర్హాన్ బద్దలు కొట్టాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా శ్రీలంకతో శనివారం జరిగిన తమ ఆఖరి సూపర్-8 మ్యాచ్‌లో ఫర్హాన్(60 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 100) సెంచరీ చేయడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు.

ఈ టోర్నీలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన ఫర్హాన్ 383 పరుగులు చేశాడు. 2014 టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ 319 పరుగులు చేశాడు. గత 12 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఈ రికార్డ్‌ను ఫర్హాన్ అధిగమించాడు. ఆ తర్వాత శ్రీలంక మాజీ ప్లేయర్ తిలక రత్నే దిల్షాన్(317) మూడో స్థానంలో ఉన్నాడు. 2009 టీ20 ప్రపంచకప్‌లో అతను 317 పరుగులు చేశాడు.

షాహిబ్జాద్ ఫర్హాన్ 320* (2026*)
విరాట్ కోహ్లీ 319 (2014)
తిలక్ రత్నే దిల్షాన్ 317 (2009)
బాబర్ ఆజామ్ 303 (2021)
మహేళ జయవర్దనే 302 (2010)
ఒకే ఎడిషన్ టీ20 ప్రపంచకప్‌లో రెండు శతకాలు నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. తాజా మ్యాచ్‌తో పాటు నమీబియాతో మ్యాచ్‌లో ఫర్హాన్ శతకాలు నమోదు చేశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక శతకాలు నమోదు చేసిన బ్యాటర్‌గా క్రిస్ గేల్ రికార్డ్‌ను సమం చేశాడు. పొట్టి ప్రపంచకప్‌ల్లో గేల్ 2 సెంచరీలు నమోదు చేశాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఫర్హాన్ శతకంతో పాటు ఫకార్ జమాన్(42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 84) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ టోర్నీలో ఫకార్ జమాన్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషంక(3/33) మూడు వికెట్లు తీయగా.. డసన్ షనక(2/42) రెండు వికెట్లు పడగొట్టాడు. దుష్మంత చమీర(1/48) ఒక వికెట్ తీసాడు.
