లాహోర్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్‌పై సొంత అభిమానులే మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆసియాకప్ 2023లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న కీలక సూపర్-4 మ్యాచ్‌లో బాబర్ ఆజామ్(35 బంతుల్లో 3 ఫోర్లతో 29)దారుణంగా విఫలమయ్యాడు. శ్రీలంక స్పిన్ సెన్సేషన్ దునిత్ లెల్లలాగే బౌలింగ్‌లో స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. వెల్లలాగే వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన బాబర్ ఆజామ్ మూల్యం చెల్లించుకున్నాడు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన సమయంలో బాబర్ ఆజామ్ నిర్లక్ష్యంగా ఔటవ్వడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో బాబర్ ఆజామ్ బాధ్యతాయుతంగా ఆడాల్సిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే టోర్నీలో పసికూన నేపాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్(151) విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు.

ఆ తర్వాత భారత్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లోనూ బాబర్ ఆజామ్(22 బంతుల్లో ఫోర్‌తో 17) విఫలమవ్వగా.. బౌలింగ్ బలంతో పాక్ విజయాన్నందుకుంది. తాజా సూపర్ 4 మ్యాచ్‌లో బాబర్ విఫలమవడంతో 'పసికూనలపైనేనా నీ ప్రతాపం'అంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.
బలమైన జట్లపై బాబర్ ఆజామ్ రాణించిన సందర్భాలు చాలా అరుదని, ముఖ్యంగా ఒత్తిడి ఉన్న మ్యాచ్‌ల్లో ఆడలేడని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. బ్యాటింగ్‌కు కాస్త ప్రతికూలంగా ఉన్న పిచ్‌లపై కూడా బాబర్ ఆజామ్ రాణించలేడని గణంకాలతో సహా వివరిస్తున్నారు. పసికూన జట్లపై పులిలా చెలరేగే బాబర్ ఆజామ్.. బలమైన జట్లతో మాత్రం పిల్లిలా విఫలమవుతున్నాడని మండిపడుతున్నారు.
జింబాబ్వే, ఐర్లాండ్, నేపాల్, అఫ్గానిస్థాన్ వంటి బలహీనమైన జట్లపైనే బాబర్ సెంచరీల మోత మోగిస్తాడని, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్ వంటి బలమైన జట్లపై రాణించిన సందర్భాలు చాలా తక్కువని ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా బౌలింగ్ బలంగా ఉన్న జట్లపై అతను విఫలమవుతాడని గుర్తు చేస్తున్నారు. అసలు బాబర్ ఆజామ్.. వరల్డ్ నెంబర్ వన్ బ్యాటర్ ఎలా అయ్యారో అర్థం కావడం లేదని ట్రోల్ చేస్తున్నారు.
శ్రీలంకతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్థాన్ టాపార్డర్ కుప్పకూలింది. లంక బౌలర్లు నిప్పులు చెరగడంతో 130 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓవైపు మతీష పతీరణ.. మరోవైపు వెల్లలాగే, మహీష్ తీక్షణ చెలరేగడంతో పాక్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.
ఓపెనర్ అబ్దుల్లా షఫీఖ్(52) మినహా మహమ్మద్ హ్యారీస్(3), మహమ్మద్ నవాజ్(12), ఫకార్ జమన్(4) దారుణంగా విఫలమయ్యారు. ప్రస్తుతం క్రీజులో మహమ్మద్ రిజ్వాన్(32 బ్యాటింగ్)తో పాటు ఇఫ్తికర్ అహ్మద్(10 బ్యాటింగ్) ఉన్నారు.